రాములోరి సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం

ఎన్నికల హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని ఈనెల 11న భద్రాద్రి రాముల వారి సన్నిధిలో ప్రారంభించనున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు

  • By: Somu    latest    Mar 04, 2024 12:14 PM IST
రాములోరి సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం
  • ఎన్నికల కోడ్‌లోగానే మరో 11వేల ఉద్యోగ నియమకాలు
  • మంత్రి పొంగులేటి వెల్లడి


విధాత : ఎన్నికల హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని ఈనెల 11న భద్రాద్రి రాముల వారి సన్నిధిలో ప్రారంభించనున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ధరణి పోర్టల్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న అప్లికేషన్‌లపై సోమవారం సత్తుపల్లి నియోజకవర్గంలోని ఎంఆర్‌ గార్డెన్స్ లో జరిగిన రివ్యూ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రెవెన్యూ సెక్టార్‌లో అవినీతి పూర్తిగా అంతరించాలని పేర్కొన్నారు.

గత పద్దతులు మానుకుని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు మంచి చేసేలా అధికారులు ముందుకు వెళ్ళాలని ఆయన సూచనలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే సుమారు 22 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం మెగా డీఎస్సీనీ ప్రకటించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 11 వేల ఉద్యోగ నియామకాలను ఎన్నికల కోడ్‌కు ముందుగానే చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి తదితరులు పాల్గొన్నారు.