పెరుగుతున్న మసాలా దినుసుల ధరలు..! వంటింటిపై భారీగా ప్రభావం..!
నిత్యావసర ధరల పెరుగుదలతో వంటింటిపై భారం పడుతున్నది. దీంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు
Spices Price Hike | నిత్యావసర ధరల పెరుగుదలతో వంటింటిపై భారం పడుతున్నది. దీంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు టామాటా, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా మసాలా దినుసుల ధరలు సైతం విపరీతంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా జేబులకు చిల్లులుపడుతున్నాయి.
ఈ ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం 22శాతం పెరిగింది. జీలకర్ర, పసుపు, మిర్చి, మిరియాలు, ఇతర మసాలా దినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మసాలా దినుసులకు మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉన్నది. అయితే, ఆయా పంటల విస్తీర్ణం తగ్గడంతో పాటు తెగుళ్ల బెడద పంటల దిగుబడిపై ప్రభావం చూపుతున్నది. సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం జులై నుంచి 22శాతంపైనే ఉంది.
ఈ డిసెంబర్, వచ్చే మార్చి మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం మరో 0.6శాతం పెరిగే అవకాశం ఉందని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పంటల దిగుబడి వచ్చే వరకు ధరలు తగ్గే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ మాట్లాడుతూ.. సుగంధ ద్రవ్యాలు తక్కువ బరువును కలిగి ఉన్నప్పటికీ వాటి ధరల పెరుగుదల వివిధ ఆహార ఉత్పత్తులను ప్రభావితం చేస్తుందన్నారు.
మసాలా దినుసుల ధరల పెరుగుదల సాస్‌లు, ప్యాక్‌డ్ ఫుడ్స్, మసాలాలు, స్వీట్స్ తదితర వస్తువుల ధరలు పెరుగుదలకు కారణమవుతాయన్నారు. ముఖ్యంగా తక్కువ ఉత్పత్తి కారణంగా జీలకర్ర, మిరియాలు, మిరపపై ప్రభావం చూపుతుంది. ఖరీఫ్ సీజన్‌లో తక్కువ ఉత్పత్తితో పాటు గరం మసాలా వంటి వస్తువులకు అవసరమైన సుగంధ ద్రవ్యాల విస్తీర్ణం తగ్గడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.
మార్చి 2024 నాటికి వచ్చే రబీ సీజన్ పంట సైతం ధరలను అదుపు చేయలేకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా, ఎగుమతి డిమాండ్ కారణంగా ధరలను గణనీయంగా ప్రభావితం చేయకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి జీరా డిమాండ్ విపరీతంగా ఉన్నది.
గతేడాదితో పోల్చితే నవంబర్‌లో జీరా ధరలు 112.6శాతం పెరిగాయి. పసుపు సైతం క్వింటాల్‌కు రూ.7,000 నుంచి ఏడాది రూ.12,600 పెరిగాయి. పసుపు, ఎండు మిర్చీ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 10.6శాతం నమోదు చేశాయి. కొత్తిమీర సాగు విస్తీర్ణం 30శాతం తగ్గడంతో ధరలను భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక భారత దేశ రిటైర్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 4.87శాతం నుంచి నవంబర్‌లో 5.55 శాతానికి పెరిగింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram