Intermediate Board | విద్యార్థుల ఆత్మహత్యలపై వివరాల్లేవు.. RTI ద‌ర‌ఖాస్తుకు ఇంటర్ విద్యాశాఖ స‌మాధానం

Intermediate కేవ‌లం రెండేళ్ల స‌మాచారం మాత్ర‌మే ఉంది ఈ రెండేళ్ల‌లో ఆరుగురు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు ఇందులో 5 గురు శ్రీ‌చైత‌న్య క‌ళాశాల విద్యార్థులు ఆర్టీఐ ద‌ర‌ఖాస్తుకు ఇంటర్ విద్యాశాఖ ఇచ్చిన స‌మాచారం ఇది వారి నిర్లక్ష్యానికి నిద‌ర్శ‌న‌మ‌న్న‌ యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ పౌండ‌ర్ రాజేంద్ర విధాత‌: తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఎంత మంది ఇంట‌ర్ విద్యార్థులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు చేసుకున్నార‌నే స‌మాచారం పూర్తిగా త‌మ వ‌ద్ద లేద‌ని, కేవ‌లం రెండేళ్ల స‌మాచారం […]

Intermediate Board | విద్యార్థుల ఆత్మహత్యలపై వివరాల్లేవు.. RTI ద‌ర‌ఖాస్తుకు ఇంటర్ విద్యాశాఖ స‌మాధానం

Intermediate

  • కేవ‌లం రెండేళ్ల స‌మాచారం మాత్ర‌మే ఉంది
  • ఈ రెండేళ్ల‌లో ఆరుగురు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు
  • ఇందులో 5 గురు శ్రీ‌చైత‌న్య క‌ళాశాల విద్యార్థులు
  • ఆర్టీఐ ద‌ర‌ఖాస్తుకు ఇంటర్ విద్యాశాఖ ఇచ్చిన స‌మాచారం ఇది
  • వారి నిర్లక్ష్యానికి నిద‌ర్శ‌న‌మ‌న్న‌ యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ పౌండ‌ర్ రాజేంద్ర

విధాత‌: తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఎంత మంది ఇంట‌ర్ విద్యార్థులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాలు చేసుకున్నార‌నే స‌మాచారం పూర్తిగా త‌మ వ‌ద్ద లేద‌ని, కేవ‌లం రెండేళ్ల స‌మాచారం మాత్ర‌మే త‌మ వ‌ద్ద ఉన్న‌ద‌ని ఇంట‌ర్ విద్యాశాఖ తెలిపింది. రెండేళ్ల‌లో ఆరుగురు ఇంట‌ర్ విద్యార్థులు ఆత్మ‌హత్య‌లు చేసుకున్నార‌ని తెలిపింది. యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ఇంట‌ర్ విద్యా కమిష‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌గా వచ్చిన స‌మాచారం ఇది.

కార్పొరేట్‌ విద్యాసంస్థ‌ల్లో చ‌దువుల‌ ఒత్తిడి భ‌రించ‌లేక ఎంతోమంది విద్యార్థులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. త‌మ నిండు జీవితాల‌ను చేజేతులా నాశ‌నం చేసుకుంటున్నారు. ఎందుకు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారో అనే విష‌యంపై లోతైన విశ్లేష‌ణ చేసేవారు క‌రువైపోయారు.

తెలంగాణలో ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది విద్యార్ధులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు? సంవత్సరాల వారీగా ఆ వివరాలు.. విద్యార్ధులు మాన‌సిక‌ ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు తెలియజేయాలని యూత్ ఫ‌ర్ యాంటీ క‌రప్ష‌న్ సంస్థ స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం ద్వారా ఇంట‌ర్ క‌మిష‌న్ కార్యాల‌యానికి ద‌ర‌ఖాస్తు చేసింది.

దీనిపై ఇంట‌ర్ క‌మిష‌న్ కార్యాల‌యం పీఐవో అధికారిణి వ‌సుంధ‌రా దేవి స‌మాధానం ఇచ్చారు. త‌మ కార్యాల‌యంలో అందుబాటులో ఉన్న స‌మాచారాన్ని మాత్ర‌మే పంపుతున్నామ‌ని తెలిపారు. ఈ మేర‌కు 2020-21లో ముగ్గురు, 2022-23లో ముగ్గురు ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నార‌ని స‌మాధానం ఇచ్చారు. ఈ రెండు సంవత్స‌రాల‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆరుగురు విద్యార్థుల్లో ఐదుగురు శ్రీచైత‌న్య క‌ళాశాల‌కు సంబంధించిన వారు కాగా, ఒకరు టీఎస్ఎంఎస్ మ‌గ్గిడి క‌ళాశాల‌కు చెందిన వార‌ని తెలిపారు.

ఇంత నిర్లక్ష్యమా?

తాము తెలంగాణ ఏర్ప‌డిన నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కార్పొరేట్‌ క‌ళాశాల‌ల్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థుల వివరాలు అడిగితే ఇంట‌ర్ క‌మిష‌న్ కార్యాల‌యం త‌మ ద‌గ్గ‌ర రెండు సంవ‌త్స‌రాల స‌మాచార‌మే అందుబాటులో ఉన్నదని చెప్ప‌డం వారి నిర్లక్ష్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ ఫౌండ‌ర్ రాజేంద్ర అన్నారు. విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల వివ‌రాలు లేక‌పోవ‌డం విడ్డూర‌మ‌న్నారు. దీనిపై సంబంధిత శాఖ ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు.