Israel | నలుగురు యువకులను ఉరి తీసిన ఇరాన్..
ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై నలుగురు వ్యక్తులను ఇరాన్ ఉరితీసింది. సోమవారం ఈ ప్రక్రియను ముగించినట్లు వెల్లడించింది

ఇజ్రాయెల్ గూఢచారులని ఆరోపణ
Israel | విధాత: ఇజ్రాయెల్ (Israel) తరఫున గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై నలుగురు వ్యక్తులను ఇరాన్ (Iran) ఉరితీసింది. సోమవారం ఈ ప్రక్రియను ముగించినట్లు వెల్లడించింది. వీరందరి దోషిత్వం నిరూపితమవడంతో ఆ దేశ సుప్రీంకోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. నలుగురు యువకులూ (Execute Four Men) చేసుకున్న చివరి అప్పీలును కూడా కోర్టు తిరస్కరించడంతో ఉరిశిక్షను అమలు చేసినట్లు ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. శిక్షకు గురైన వారి పేర్లను మొహమ్మద్ ఫరామార్జీ, మోహ్‌సెన్ మజ్‌లౌమ్, వాఫా అజర్‌బర్, పజ్‌మన్ ఫతేహీ లుగా ప్రకటించారు. వీరంతా ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతానికి చెందినవారని.. ఇరాన్‌లోకి అక్రమంగా ప్రవేశించారని పోలీసులు ఆరోపణలు మోపారు.
ఇరాన్ సైన్యానికి రక్షణ పరికరాలు సమకూర్చే ఇఫ్సాహన్‌లో ఉన్న ప్యాక్టరీని పేల్చేయడానికి ఇజ్రాయెల్ వీరిని నియమించుకుందని తెలిపారు. 2022లో వీరు ఆ చర్యకు ప్రణాళిక వేసినప్పటికీ.. తమ నిఘా విభాగం కుట్రను ఛేదించి నిలువరించిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ అయిన మొసాద్ వారిని నియమించుకుని సంవత్సరంన్నర కాలంపాటు శిక్షణ కూడా ఇచ్చిందని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు నెల క్రితమే ఇదే తరహా ఆరోపణలతో ఒక వ్యక్తిని ఇరాన్ ఉరి తీసింది. ప్రభుత్వానికి చెందిన రహస్య సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నారంటూ అతడిపై ఆరోపణలు మోపింది.
అయితే ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఎప్పుడో మొదలైంది. ఇరు దేశాలూ ఒకదానిపై ఒకటి గూఢచర్యం చేసుకుంటూ రహస్య ఆపరేషన్లకు పాల్పడుతూ ఉంటాయి. తమ అణుసంపత్తిని నాశనం చేయాలని చూస్తోందని ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఆరోపణలు గుప్పిస్తుండగా.. ఇరాన్ ఆయుధాలను తమ నాశనానికే ఉపయోగిస్తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన ప్రతిదాడికి నిరసనగా.. ఇరాన్ మద్దతున్న లెబనాన్ హిజ్బుల్లా, యెమన్ హౌతీ దళాలు యూదు దేశంపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజా ఉరిశిక్ష అమలుతో ఈ ఘర్షణ మరింత పెరిగే అవకాశముంది.