Telangana | సోనియా క‌ల నెరవేరేనా.. నేతల మధ్య ఐక్యతే కల నెరవేరే మార్గం

Telangana ఇప్పటికీ అంతర్గతంగా విభేదాల సెగలు 65 స్థానాలు మావే అంటున్న బీఆరెస్‌ ఈ 3 జిల్లాల్లో తగ్గినా ఇబ్బంది లేదని ధీమా అధికారంపై అంచనాల్లో బీజేపీ నేతలు కొద్దిరోజుల్లో కీలక పరిణామాలని లీకులు విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క‌ల నెర‌వేరేనా? అన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జ‌రుగుతోంది. తెలంగాణ‌లో అధికార ప‌గ్గాలు చేప‌ట్టాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉన్న కాంగ్రెస్.. యావత్‌ జాతీయ నాయకత్వాన్ని తెలంగాణపైనే […]

  • Publish Date - September 20, 2023 / 05:18 AM IST

Telangana

  • ఇప్పటికీ అంతర్గతంగా విభేదాల సెగలు
  • 65 స్థానాలు మావే అంటున్న బీఆరెస్‌
  • ఈ 3 జిల్లాల్లో తగ్గినా ఇబ్బంది లేదని ధీమా
  • అధికారంపై అంచనాల్లో బీజేపీ నేతలు
  • కొద్దిరోజుల్లో కీలక పరిణామాలని లీకులు

విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క‌ల నెర‌వేరేనా? అన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జ‌రుగుతోంది. తెలంగాణ‌లో అధికార ప‌గ్గాలు చేప‌ట్టాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉన్న కాంగ్రెస్.. యావత్‌ జాతీయ నాయకత్వాన్ని తెలంగాణపైనే కేంద్రీక‌రించింది. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వ‌హించింది. జాతీయ నాయ‌క‌త్వాన్ని తెలంగాణ అంత‌టా త‌ప్పింది.

భారీ ఎత్తున జ‌నాన్ని స‌మీక‌రించి, విజ‌య భేరీ పేరుతో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. ఈ స‌భ‌లోనే ఆరు గ్యారెంటీలు విడుద‌ల చేసి, ఆ కార్డుల‌ను ప్ర‌తి ఇంటికీ పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మొద‌టి క్యాబినెట్ స‌మావేశంలోనే గ్యారెంటీ కార్డులో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తామని ప్ర‌క‌టించింది.

సోనియా చేసిన ప్ర‌క‌ట‌న తెలంగాణ ప్ర‌జా స‌మూహంలోకి వెళ్లింది. మ‌రోవైపు జాతీయ స్థాయి నేత‌లంతా అన్ని నియోజ‌కవ‌ర్గాల‌లో ప‌ర్య‌టించి కార్డుల పంపిణీని చేప‌డుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమ‌లు చేసిన ప‌థ‌కాల‌ను వివ‌రిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌కు మైలేజీ పెరిగింది.

అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆరెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు కాంగ్రెస్ విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీసే విధంగా త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముంగిట‌ రాష్ట్రంలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. నాయ‌కులు, పార్టీల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ అధికారం ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే చర్చలు జోరుగా జరుగుతున్నాయి.

మాదంటే మాదేనంటున్న మూడు పార్టీలు

తెలంగాణలో ప్రధాన పార్టీలుగా ఉన్న బీఆరెస్‌, కాంగ్రెస్, బీజేపీ ఈసారి అధికారం మాదంటే, మాదంటూ ప్రకటించుకుంటున్నాయి. అయితే అధికారంలో ఉన్న బీఆరెస్‌కు మాత్రం ఈసారి గ‌డ్డు ప‌రిస్థితులు త‌ప్ప‌వంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అభ్య‌ర్థుల విష‌యంలో ఒక్క అడుగు ముందుకేసిన బీఆరెస్‌ అన్ని పార్టీల‌కంటే ముందే జాబితాను విడుద‌ల చేసింది.

ఈ క్ర‌మంలో సీట్లు ఆశించి ఎప్ప‌టి నుంచో అస‌మ్ముతి వ్య‌క్తం చేస్తున్న అభ్య‌ర్థులు బీఆరెస్ బాస్‌కు షాకులు ఇస్తున్నారు. దీనికి తోడు జ‌నాల్లో కూడా వ్య‌తిరేక‌త మూట క‌ట్టుకున్నారు. క్రమంగా పుంజుకుంటున్న కాంగ్రెస్‌కు ఇది క‌లిసొస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, పాల‌మూరు జిల్లాల్లో అనుకున్న సీట్లు గెలువ‌క పోయినా 65 స్థానాల్లో గులాబీ జెండా ఎగ‌రేస్తామ‌ని, మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని బీఆరెస్ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అయిన‌ప్ప‌టికీ పార్టీ ఎవరి నాయకత్వంలో నడుస్తున్నదో ఎవరు చెప్పలేని స్థితి ఇప్పటికీ ఉంద‌ని పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత ఒక‌రు అన్నారు. అధిష్ఠానం ఆదేశాల మేర‌కు పైకి తామంతా ఒక్కటే అని చెప్తున్నప్ప‌టికీ పార్టీలో ఆధిప‌త్య‌ పోరు జరుగుతూనే ఉంద‌ని అంటున్నారు. సోనియా గాంధీ హైద‌రాబాద్‌కు వ‌చ్చిన వెళ్లిన త‌రువాత ఆరు గ్యారెంటీల కార్డుల పంపిణీలో నాయ‌కుల మ‌ధ్య విభేదాలు వెలుగు చూశాయ‌ని అంటున్నారు.

హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ సీడబ్ల్యూసీ స‌మావేశంలో, విజ‌య‌భేరి స‌భ‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డం త‌న క‌ల అని చెప్పారు. ఈ క్ర‌మంలోనే టీ కాంగ్రెస్ ప‌గ్గాలు రాహుల్‌, సోనియా, సునీల్ క‌నుగోలు చేతిలో మాత్ర‌మే ఉన్నాయ‌ని, అందుకే ఈ మ‌ధ్య‌ కాస్త గొడ‌వ‌లు త‌గ్గుముఖం పట్టాయని కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి. ప్రస్తుతానికి సునీల్ క‌నుగోలు పార్టీని మానిట‌రింగ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌రో తెలియ‌క క్యాడ‌ర్‌లో కాస్త కన్ఫ్యూజ‌న్ అలాగే ఉండిపోయింది. అధిష్ఠానం ఎవ‌రివైపు చూస్తోందో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే సీనియ‌ర్ నేత‌లంతా ఎవ‌రికి వారు పార్టీ గెలిస్తే తామే సీఎం అవుతామ‌ని లెక్కలేసుకుంటున్నారు. ఐతే వీరంతా ఐక్య‌మత్యంతో ప‌ని చేస్తారా? లేదా అన్న దానిపైనే సోనియా క‌ల నెర‌వేరుతుందా? అన్న‌ది ఆధారప‌డి ఉంటుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

బీఆరెస్‌, బీజేపీ రెండు ఒక‌టేన‌ని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. బీజేపీ మాత్రం బీఆరెస్‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తోంది. ల‌క్ష‌ల కోట్ల అవినీతి చేసింద‌ని మండిపడుతున్నది. ఈసారి తెలంగాణ‌పై బీజేపీ జెండా ఎగ‌రేస్తామ‌ని ప్రకటిస్తున్నది. తెలంగాణ రాజ‌కీయాలు మ‌రి కొద్ది రోజుల్లో త‌ల కిందులైతాయ‌ని, ఎవ‌రూ ఊహించని రీతిలో బీజేపీలో చేరిక‌లు ఉంటాయని ఆ పార్టీ ముఖ్య‌ నాయ‌కులు స‌న్నిహితుల వ‌ద్ద వెల్ల‌డించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేపుతున్నది.