జైలును ఆక్రమించుకుని డెన్‌గా మార్చుకున్న ఖైదీలు… అందులోనే జూ, నైట్ క్లబ్

- 11 వేల మంది భద్రతా సిబ్బంది పోరాటంతో తిరిగి స్వాధీనం
- వెనెజువెలాలో ఘటన
కరడు కట్టిన ఖైదీల చేతిలో బిట్‌కాయిన్ మైనింగ్, మెషీన్లు, ఆయుధ తయారీలకు శిబిరంగా మారిన ఓ జైలును వెనెజువెలా (Venezuela) పోలీసులు తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. స్థానిక జైలు అధికారులను బుట్టలో వేసుకుని అక్కడ ఖైదీలు ఏర్పాటు చేసుకున్న వసతులు చూసి పోలీసు అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. భారీ యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు ధరించిన 11,000 మంది భద్రతా సిబ్బంది క్రిమినల్ ముఠాల చేతిలో ఉన్న జైలును భారీ పోరాటం తర్వాత చేజిక్కుంచుకున్నారు.
ఆరాగ్వా రాష్ట్రంలో ఉన్న టోకోరన్ జైలు పరోక్షంగా ట్రెన్ డె అరాగ్వా అనే కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ముఠా అధీనంలో ఉంది. ఇందులో వీరు ఏర్పాటు చేసుకున్న సౌకర్యాలను చూసి పోలీసుల కళ్లు చెదిరిపోయాయి. ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో గ్యాంగ్‌స్టర్‌ల స్థాయిని బట్టి రూంలు ఉన్నాయి. అందులోనే స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్‌లతో పాటు ఏకంగా ఒక మినీ జూని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
ఆ జూలో సింహాలు, పులులు, మొసళ్లు తదితర వన్య మృగాలు కూడా ఉండటం గమనార్హం. అంతేకాకుండా ఇందులో టోకియో అనే నైట్ క్లబ్, బేస్ బాల్ ఫీల్డ్, గ్యాంబ్లింగ్, బిట్ కాయిన్ మైనింగ్‌కి ప్రత్యేక ఏర్పాట్లు తదితర వసతులన్నింటినీ వారు సమకూర్చుకున్నారు. కొంత మంది పైస్థాయి గ్యాంగ్‌స్టర్‌లు తమ కుటుంబాలతో సహా ఈ జైలులో తిష్ఠ వేశారు. వారికి టెలివిజన్, ఇంటర్నెట్ సౌకర్యమూ ఉంది. ట్రెన్ డె అరాగ్వా అనే ఈ ముఠా పెద్దలతో టోకోరన్ జైలు సిబ్బంది చేతులు కలిపారని స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ ఘటనకు సంబంధించి నలుగురు జైలు అధికారులను అరెస్టు చేశామని, అందులోని ఖైదీలను వేరే జైలుకు తరలించామని వెనెజువెలా న్యాయశాఖ మంత్రి రెమిగియో సెబాల్లోస్ పేర్కొన్నారు. మొత్తం ఇందులో 1600 మంది ఖైదీలు ఉన్నారని అంచనా. వారిని వేరే జైళ్లకు తరలిస్తున్నారు. ఈ దాడిలో పాల్గొన్న 11 వేల మంది భద్రతా సిబ్బందిని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఎక్స్‌లో అభినందించారు.
త్వరలోనే గ్యాంగ్‌స్టర్‌లు లేని వెనెజువెలాను చూస్తామని ఆయన అన్నారు. అయితే మరో 400 నుంచి 500 మంది వరకు ఖైదీలు తప్పించుకున్నారని, వారు సమీపంలోనే ఉన్న ఎల్ జంక్విటో పర్వతసానువుల్లో నక్కి ఉండొచ్చని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా పేరు మోసిన క్రిమినల్ గ్యాంగులకు వెనెజువెలా కీలక స్థావరంగా ఉంటూ వస్తోంది. ప్రభుత్వ అధీనంలో ఉన్న జైలును ఒక ముఠా ఆక్రమించుకుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.