జపాన్‌ను వణించిన వరుస భూకంపాలు.. ఒకే రోజు 155 సార్లు ప్రకంపనలు..! ఆరుగురు మృతి

వరుస భూకంపాలు జపాన్‌ను వణికిస్తున్నాయి. న్యూ ఇయర్‌ రోజున 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

జపాన్‌ను వణించిన వరుస భూకంపాలు.. ఒకే రోజు 155 సార్లు ప్రకంపనలు..! ఆరుగురు మృతి

Japan Earthquake | వరుస భూకంపాలు జపాన్‌ను వణికిస్తున్నాయి. న్యూ ఇయర్‌ రోజున 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. జపాన్‌లో సోమవారం ఒకేరోజు 155 సార్లు భూ ప్రకంపనలు రికార్డయ్యాయి. ఈ క్రమంలో జపాన్‌ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లోకి పలుచోట్ల నీరు ముందుకు చొచ్చుకువచ్చింది.


తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రస్తుతానికి ఇండ్ల వైపు వెళ్లొద్దని సునామీ హెచ్చరికల కేంద్రం సూచించింది. సుమారు వెయ్యి మంది ఆర్మీ బేస్‌ వద్ద ఆశ్రయం పొందారు. వెంటనే ఘటనా స్థలానికి సహాయక సామగ్రిని పంపించి ప్రజలను రక్షించేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు జపాన్ ప్రధాని చెప్పారు. భూ కంపాల కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.


అధికారులతో పీఎం సమావేశం


వరుస భూకంపాల నేపథ్యంలో సోమవారం రాత్రి డిజాస్టర్‌ రెస్క్యూ ఫోర్స్‌తో ప్రధాని ఫుమియో కిషిడా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెస్క్యూ ఫోర్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో అధికారులు, ఉద్యోగులకు సహాయక చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం చలి తారాస్థాయికి చేరుకుందని.. నీరు, ఆహారం, దుప్పట్లు, హీటింగ్‌ ఆయిల్‌, గ్యాసోలిన్‌ తదితర నిత్యావసర వస్తువులను వెంటనే సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.


తీర ప్రాంతాల్లో కూలిన భవనాలు..


జపాపన్‌లో సోమవారం ఒకే రోజు 155 భూ ప్రకంపనలు సంభవించాయి. ఇందులో రెండు భూకంపాల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.6, ఆ తర్వాత 6 తీవ్రత నమోదైందని అధికారులు పేర్కొన్నారు. 7.6 తీవ్రతతో వచ్చిన శక్తివంతమైన భూకంపం కారణంగా జపాన్‌ పశ్చిమ తీరంలో భవనాలు కుప్పకూలాయి. భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు.


హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇషికావా ప్రిఫెక్చర్‌లో సంభవించిన భూకంపం తీవ్రత 7.5గా ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అదే సమయంలో ఇషికావాలో భూకంప తీవ్రత 7.6గా ఉందని జపాన్ అధికారులు తెలిపారు. జపాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వాజిమా ఓడరేవు వద్ద నాలుగు అడుగుల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి.


ఇండ్లకు కరెంటు సరఫరా బంద్‌..


భూకంపం కారణంగా ఇషికావా ప్రిఫెక్చర్‌లోని వాజిమా నగరంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత 32వేలకుపైగా ఇళ్లలో విద్యుత్తు నిలిచిపోయిందని ప్రభుత్వ ప్రతినిధి యోషిమాసా హయాషి తెలిపారు. వాతావరణ సంస్థ మొదట ఇషికావాకు భారీ సునామీ హెచ్చరికను జారీ చేసింది. అలాగే హోన్షులోని మిగతా పశ్చిమ తీరానికి, అలాగే దేశంలోని ఉత్తరాన ఉన్న ప్రధాన ద్వీపమైన హక్కైడోకు స్వల్ప హెచ్చరికలు జారీ చేసింది.


తీర ప్రాంతాల నుంచి ప్రజలు దూరంగా వెళ్లడం మంచిదని హోషియా సూచించారు. అలాగే, ఉత్తర కొరియా, రష్యాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. జపాన్‌ ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జపాన్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.