Moon | చంద్రునిపై కుక్క పిల్ల‌..నిద్ర‌లేచి ఫొటో పంపిన జ‌పాన్ ‘స్లిమ్‌’

చంద్రునిపైకి జ‌పాన్ పంపిన స్మార్ట్ ల్యాండ‌ర్ ఫ‌ర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ ల్యాండ‌ర్ తిరిగి చేత‌నావ‌స్థ‌లోకి వ‌చ్చిన‌ట్లు అంత‌రిక్ష సంస్థ జాక్సా ప్ర‌క‌టించింది

Moon | చంద్రునిపై కుక్క పిల్ల‌..నిద్ర‌లేచి ఫొటో పంపిన జ‌పాన్ ‘స్లిమ్‌’

Moon | విధాత‌: చంద్రుని (Moon) పైకి జ‌పాన్ (Japan) పంపిన స్మార్ట్ ల్యాండ‌ర్ ఫ‌ర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (స్లిమ్‌) ల్యాండ‌ర్ తిరిగి చేత‌నావ‌స్థ‌లోకి వ‌చ్చిన‌ట్లు ఆ దేశ అంత‌రిక్ష సంస్థ జాక్సా (JAXA) ప్ర‌క‌టించింది. తొలుత ఇది అక్క‌డి ఉప‌రిత‌లంపై ల్యాండ్ అవ్వ‌గానే సోలార్ బ్యాట‌రీల‌లో స‌మ‌స్య త‌లెత్తింది. దీంతో ఇది ఇక ప‌నిచేయ‌ద‌ని శాస్త్రవేత్త‌లు భావించారు. అయితే అనూహ్యంగా అది ప‌ని చేయ‌డం మొద‌లుపెట్టిన‌ట్లు ప్ర‌క‌టించారు. స్లిమ్‌ (SLIM)తో స‌మ‌చార వ్య‌వ‌స్థ బ‌ట్వాడాను వ్య‌వ‌స్థీక‌రించామ‌ని జాక్సా శాస్త్రవేత్త‌లు వెల్ల‌డించారు.


‘స్లిమ్‌తో స‌మాచార ఛాన‌ల్‌ను పున‌రుద్ధ‌రించాం. నిన్న రాత్రి నుంచి అన్ని ప‌రిక‌రాలు ప‌నిచేస్తున్నాయి’ అని సోమ‌వారం ప్ర‌క‌టించారు. అందులో ఉన్న మ‌ల్టీ బ్యాండ్ స్పెక్ట్రోస్కోపిక్ కెమెరాతో తీసిన ఫొటోను ఎక్స్‌లో పంచుకున్నారు. ఆ ఫొటోను ప‌రిశీలించి చూడ‌గా ఒక చిన్న కుక్క పిల్ల బొమ్మ ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. అంత‌కుముందు జ‌న‌వ‌రి 20న స్లిమ్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండ్ అయింది. శాస్త్రవేత్త‌లు నిర్దేశించిన ల‌క్ష్యానికి 100 మీట‌ర్ల దూరంలోనే దిగి.. సామ‌ర్థ్యాన్ని నిరూపించుకుంది. త‌ద్వారా అమెరికా, చైనా, భార‌త్‌, ర‌ష్యాల స‌ర‌స‌న జ‌పాన్ చేరింది.


అయితే ల్యాండ్ అయిన మూడు గంట‌ల త‌ర్వాత సోలార్ బ్యాట‌రీల‌లో సాంకేతిక స‌మ‌స్య ఏర్ప‌డ‌టంతో విద్యుదుత్ప‌త్తికి అవాంత‌రం ఏర్ప‌డింది. దీంతో అందులో పేలోడ్‌లు నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇవి ఉత్తేజిత‌మై ప‌ని ప్రారంభించిన‌ట్లు శాస్త్రవేత్త‌లు ప్ర‌క‌టించ‌డంతో అంత‌రిక్ష ప్రేమికులు ఊపిరిపీల్చుకున్నారు. స్లిమ్‌లో రెండు పేలోడ్‌లను పంపించ‌గా.. చంద్రుని ఉప‌రిత‌లాన్ని ప‌రిశీలించ‌డానికి ట్రాన్స్‌మీట‌ర్‌తో కూడిన ఒక ప్రోబ్‌ను..టెన్నిస్ బాల్ ప‌రిమాణంలో ఉన్న ఒక మినీ రోవ‌ర్‌ను పంపించారు. గ‌తంలో జపాన్ పంపిన రెండు లూనార్ మిష‌న్లు విఫ‌లం కాగా.. మూడో ప్ర‌య‌త్నంలో స్లిమ్ విజ‌యం సాధించిన‌ట్ల‌యింది.