BJP – JDS | బీజేపీతో జత కట్టనున్న జేడీఎస్‌

విధాత‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన జేడీఎస్‌ బీజేపీకి దగ్గర అవుతున్నదా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే యోచనలో ఉన్నదా? ఔననే సమాధానం వస్తున్నది. ఎన్నికల సమయంలోనే బీజేపీ, జేడీఎస్‌ లోపాయీకర ఒప్పందం చేసుకున్నాయనే వార్తలు వచ్చాయి. ఫలితాల రోజూ జాతీయ మీడియాలోనూ ఒకవేళ బీజేపీకి మెజారిటీ రాకపోతే జేడీఎస్‌ (BJP – JDS) తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. దానికి బలం చేకూర్చే విధంగానే మాజీ […]

BJP – JDS | బీజేపీతో జత కట్టనున్న జేడీఎస్‌

విధాత‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన జేడీఎస్‌ బీజేపీకి దగ్గర అవుతున్నదా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే యోచనలో ఉన్నదా? ఔననే సమాధానం వస్తున్నది. ఎన్నికల సమయంలోనే బీజేపీ, జేడీఎస్‌ లోపాయీకర ఒప్పందం చేసుకున్నాయనే వార్తలు వచ్చాయి. ఫలితాల రోజూ జాతీయ మీడియాలోనూ ఒకవేళ బీజేపీకి మెజారిటీ రాకపోతే జేడీఎస్‌ (BJP – JDS) తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. దానికి బలం చేకూర్చే విధంగానే మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

పాత మైసూర్‌ ప్రాంతంలో గట్టి పట్టున్న జేడీఎస్‌ కర్ణాటక ఎన్నికల్లో ఘోరంగా చతికిల పడింది. ఆ పార్టీ ఆశించిన సీట్లు దక్కించుకోలేకపోయింది. అందుకే పోలింగ్‌ ముగిసిన రోజు ఎగ్జిట్‌పోల్స్‌ తో పాటు మాజీ సీఎం కుమారస్వామి జేడీఎస్‌కు తక్కువ సీట్లే రానున్నాయని తేల్చారు. నిజానికి ఫలితాల తర్వాత కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించాలని అనుకున్న ఆ పార్టీకి ఓటర్లు పెద్ద షాక్‌ ఇచ్చారు. మొత్తం 224 స్థానాల్లో ఆ పార్టీ 19 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీనే కాదు ఏకంగా 136 సీట్లు కట్టబెట్టారు.

దీంతో కర్ణాటకలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నది. మొత్తం 28 స్థానాల్లో ప్రస్తుతం ఆపార్టీకి ఒక్క లోక్‌సభ సీటు మాత్రమే ఉన్నది. కాంగ్రెస్‌ పార్టీ 20 పైగా లోక్‌సభ సీట్లే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నది. దీంతో జేడీఎస్‌ ఒంటరిగా వెళ్లే కంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తే తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవచ్చని భావిస్తున్నది.

ఈ నేపథ్యంలో ఒడిషా రైలు ఘోర రైలు ప్రమాదం ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో 278 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 11వందలకు పైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై ప్రతిపక్షాలన్నీ ధ్వజమెత్తాయి. కానీ జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. ప్రమాదం తర్వాత పట్టాలను పునరుద్ధరించిన తర్వాత మళ్లీ రైళ్ల రాకపోకలు సాగేవరకు రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ అక్కడే ఉండి అన్ని పనులు పర్యవేక్షించారు.

దీనిపై స్పందించిన దేవెగౌడ క్లిష్ట సమయంలో రైల్వే మంత్రి నిర్విరామంగా పనిచేశారని కితాబు ఇచ్చారు. మంత్రి గొప్ప పనితీరును చూపెట్టారని అన్నారు. ఈ సమయంలో ఆయన రాజీనామా కోరడం తెలివైన పని కాదంటూ..రైల్వే మంత్రి పనితీరును మెచ్చుకున్నారు. ఇదే సమయంలో దేశంలో ప్రతిపక్షాల తీరుపై దేవెగౌడ విమర్శలు గుప్పించారు. ఈ దేశంలో బీజేపీతో సంబంధం లేని ఒక్క పార్టీని చూపెట్టండని ఆయన ప్రశ్నించారు. ప్రత్యక్షంగానో… పరోక్షంగానో అన్నిపార్టీలు బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్నాయని వ్యాఖ్యానించారు.

బీజేపీకి వ్యతిరేకంగా అన్నిపార్టీలను ఐక్యం చేసేందుకు బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ చేస్తున్న ప్రయత్నాలకు దేవెగౌడ్‌ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ పరిణామాలను చూస్తుంటే బీజేపీకి జేడీఎస్‌ దగ్గరవుతున్నట్టు స్పష్టమౌతున్నది. గత నెల దెవేగౌడ 91వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2006లో కర్ణాకటలో జేడీఎస్‌, బీజేపీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

అప్పుడు కుమారస్వామి సీఎంగా, యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగానూ బాధ్యతలు చేపట్టారు. అయితే అధికార పంపిణీ ఫార్ముల విఫలమవడంతో ఆ ప్రభుత్వం 20 నెలల్లోనే కుప్పకూలిపోయింది. బీజేపీకి అధికారాన్ని అప్పగించడానికి జేడీఎస్‌ నిరాకరించడమే దానికి కారణం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్టు బీజేపీ, జేడీఎస్‌ల రాజకీయ అవసరాలు ఆ రెండు పార్టీలను కలిసేలా చేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేయాలని అనుకున్న కేసీఆర్‌కు జేడీఎస్‌ తీసుకునే నిర్ణయం ఎదురుదెబ్బే కానున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత ఆ కార్యక్రమానికి కుమారస్వామి వచ్చారు. ఆ సందర్భంగా కేసీఆర్‌కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి పోటీ చేస్తామన్న అసలు ఆ ఎన్నికల గురించే పట్టించుకోలేదు.

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే నితీశ్‌ ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నంలో ఉండగా.. బీజేపీ దానికి కౌంటర్‌గా గతంలో ఆ పార్టీతో కలిసి పనిచేసిన ప్రాంతీయ పార్టీలను కలుపుకునే పనిలో పడింది. సీఎం కేసీఆర్‌ కూడా ఈ మధ్య కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఏపీలో టీడీపీ, కర్ణాటకలో జేడీఎస్‌ లాంటి పార్టీలు బీజేపీ కూటమిలో జతకట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీయడానికే అనే విమర్శలు ఉన్నాయి.