కాంగ్రెస్‌లో చేరుతున్నా.. కేసీఆర్‌కు చెప్పేసిన కేశవరావు?

బీఆరెస్ సెక్రటరీ జనరల్‌గా ఉన్న కె.కేశవరావు గురువారం ఎర్రవెల్లి ఫౌమ్‌హౌస్‌లో బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు

  • By: Somu    latest    Mar 28, 2024 11:36 AM IST
కాంగ్రెస్‌లో చేరుతున్నా.. కేసీఆర్‌కు చెప్పేసిన కేశవరావు?
  • అసహనం వ్యక్తం చేసిన గులాబీ బాస్‌
  • సాకులు చెప్పొద్దంటూ కటువు వ్యాఖ్య
  • భేటీ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన కేకే?

విధాత : బీఆరెస్ సెక్రటరీ జనరల్‌గా ఉన్న కే కేశవరావుపై బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. పార్టీలో తగిన ప్రాధాన్యం, పదవులను ఇచ్చినప్పటికీ ఎందుకు పార్టీ వీడుతున్నారంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. గురువారం ఎర్రవెల్లి ఫౌమ్‌హౌస్‌కు కేకేను, ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మిని కేసీఆర్‌ పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా కేకే తాజా రాజకీయ పరిస్థితులు, తన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా తన పార్టీ మార్పుపై చోటుచేసుకున్న ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. కేసీఆర్‌ మధ్యలో కల్పించుకుని సాకులు చెప్పవద్దని కటువుగానే చెప్పారని తెలిసింది. పదేళ్ల పాటు పదవులు అనుభవించి అధికారం పోగానే పార్టీ మారుతున్నారంటూ బీఆరెస్ నేతల తీరుపై కేసీఆర్ అసహనం వెళ్లగక్కారని సమాచారం. పార్టీలు మారే వారిని ప్రజలు గమనిస్తారని, మీ ఆలోచన సరైంది కాదంటూ కేకేతో అన్నారని తెలిసింది. కేసీఆర్ మాటలకు తగ్గని కేకే.. తాను, తన కూతురు విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తేల్చి చెప్పి, సమావేశం మధ్యలోనే ఫామ్‌హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

కొద్దిరోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్ మున్షీ కేకే ఇంటికి వచ్చి ఆయనతో పాటు విజయలక్ష్మితో భేటీ అయ్యారు. దీంతో వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్నది. బీఆరెస్ కుటుంబ పార్టీగా మారిందని, అన్ని అనర్థాలకు అదే కారణమైందన్నట్లుగా కేకే ఇటీవల ఓ ఇంటర్య్వూలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేకే, కేసీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరువురి మధ్య సాగిన చర్చలు వారి మధ్య మరింత దూరాన్ని పెంచేశాయని తెలుస్తోంది. కేకేతో పాటు గద్వాల విజయలక్ష్మి 10మంది కార్పొరేటర్లతో కలిసి ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరవచ్చన్న ప్రచారం వినిపిస్తున్నది. మరోవైపు కేకే కలిసిన సందర్భంలోనే రాజేంద్రనగర్ బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా కేసీఆర్‌ను కలిశారు. ప్రకాశ్‌గౌడ్ బీఆరెస్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన తొలి ఎమ్మెల్యే. తన పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్‌కు ప్రకాశ్‌గౌడ్‌ వివరణ ఇచ్చారని తెలుస్తున్నది.