Karimnagar
విధాత బ్యూరో, కరీంనగర్: రాష్ట్రంలో అధికార పార్టీతో పొత్తు విషయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తో మునుగోడులో ముడిపడిన బంధం
ఇప్పటికైతే కొనసాగుతూనే ఉందన్నారు. ఆ ఎన్నికల్లో బిజెపి గెలుపొందకూడదనే లక్ష్యంతో అధికార పార్టీతో ఒక అవగాహనకు వచ్చామని, అది ఇంకా బ్రేక్ కాలేదని, బ్రేక్ అయినప్పుడు పరిస్థితుల గురించి ఆలోచిస్తామన్నారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో పొత్తు కుదరకపోతే తమ పద్ధతులు తమకున్నాయని స్పష్టం చేశారు.
ఆదివారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కమ్యూనిస్టులు ఎక్కువ సీట్లలో గెలవలేకపోవచ్చని, ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టించిన పార్టీల మాదిరిగా, తాము వెళ్లలేమని, తమలో నైతికత ఉందన్నారు.
ఒకరికి తలవంచేది లేదని, లొంగేదీ లేదని, తాము తమ పార్టీ సిద్ధాంతాలకు లోబడే ఉంటామని స్పష్టం చేశారు. సిపిఐ నేతలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే వార్తలను ఆయన ఖండించారు.
ముఖ్యమంత్రిని ప్రజా సమస్యలపై చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరతాం.. ఇస్తే ఎంత? ఇవ్వకుంటే ఎంత? అపాయింట్మెంట్ దొరికితే ఏవైనా కిరీటాలు వస్తాయా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
బీజేపీ ముక్త్ భారత్ గా పరిస్థితులు మారుతున్నాయి.. ప్రతిపక్ష ముక్త్ భారత్ కాదు.. బిజెపి ముక్త్ భారత్ అనే విధంగా పరిస్థితులు మారుతున్నాయని సాంబశివరావు చెప్పారు. బిజెపి దేశాన్ని వికాసం వైపు కాకుండా, వినాశం వైపు తీసుకు వెళుతుందని ఆరోపించారు. తాము దీనిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఎన్నికల సమయంలో సమస్యను సృష్టించి లబ్ధి పొందడం బిజెపికి అలవాటే అన్నారు. దేశంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సమయంలో బిజెపి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రామనే భయం బిజెపికి పట్టుకుందని, ఆ భయం ప్రధాని, ఆయన సహచరుల ముఖాల్లో స్పష్టంగా కనబడుతుందన్నారు.
ప్రధాని వరంగల్ పర్యటన ద్వారా రాష్ట్రానికి జరిగిన మేలు ఏదీ లేదన్నారు. విభజన చట్టంలోని హామీల అమలుపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోయారని చెప్పారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాలేశ్వరంకు జాతీయ హోదా ఇత్యాది అనేక అంశాలు విభజన చట్టంలో పొందుపరచబడి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
కాజీపేటలో 520 కోట్లతో వ్యాగన్ రిపేర్ యూనిట్ కు ప్రధాని శంకుస్థాపన చేసి, దానిని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పేరిట సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. వాస్తవానికి కాజీపేటలో వ్యాగన్ రిపేర్ ప్లాంట్ నడుస్తోందని, కేవలం దానిని అప్ గ్రేడేషన్ చేయడమే అని అన్నారు. దీని ద్వారా 1200 మందికి మించి ఉపాధి అవకాశాలు దొరికే వీలు లేదన్నారు.
తెలంగాణలో పట్టు సాధించడం ఎలాగు సాధ్యం కాదని భావించి, ఇక్కడ ఎన్ని పెట్టుబడులు పెట్టినా, ఫలితం లేదనే భావనకు వచ్చి, బిజెపి తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలు, వాళ్ల భాగస్వామ్య రాష్ట్రాలన్నిటికీ ప్రాజెక్టులను తరలిస్తున్నదని ఆరోపించారు.
బిజెపికి తెలంగాణలో ప్రభుత్వంలోకి రావాలన్న సీరియస్ ఆలోచన లేదని, తాము కూడా పోటీలో ఉన్నాం అని చూపించడానికే అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు.