Karnataka Assembly Elections
విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నరేంద్రమోడీ ఓటమేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ రాముడిని మోసం చేసిన బీజేపీని ఓడించారన్నారు. ఎన్నికల్లో నెగ్గేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డిందని అయినా ప్రజలు తిరస్కరించారన్నారు.
దక్షిణ భారతంలో బీజేపీకి స్థానం లేదన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాకు వెయ్యేనుగుల బలమొచ్చిదన్నారు. కర్ణాటక ప్రభావం తెలంగాణపై ఖచ్చితంగా ఉంటుందని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ గెలుపును కెటీఆర్ ప్రజా తీర్పుగా అభివర్ణించలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కేటీఆర్ కు ఇష్టం లేదని రేవంత్ తెలిపారు.
కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ చివరి దశలో ఉన్న క్యాన్సర్ పేషంట్ కోరికలాంటిదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కర్ణాటక ప్రభావం ఉండకూడదని ఆయన కోరుకుంటున్నారన్నారు. కానీ తెలంగాణపై దీని ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుందన్నారు.
బీజేపీ, బీఆర్ ఎస్ లకు మధ్య పెద్ద తేడా లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో అన్ని సందర్భాల్లో కేసీఆర్ మోదీకి అండగా నిలిచారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో మోదీని ఓడించాలని కేసీఆర్ ఎప్పుడూ ప్రచారం చేయలేదని తెలిపారు. మహారాష్ట్రలో మీటింగ్స్ పెట్టిన కేసీఆర్… కర్ణాటకలో మీటింగ్ పెట్టి మోదీని ఓడించాలని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కర్ణాటకలో ఉన్నట్లుగానే తెలంగాణలోనూ 40శాతం కమీషన్ సర్కారు ఉందన్నారు.
మోదీ కి, కేసీఆర్ కు పేరులో తేడా ఉంది తప్ప విధానాల్లో లేదన్నారు. దళితబంధులో 30శాతం తీసుకుంటున్నారని కేసీఆరే వాళ్ల ఎమ్మెల్యేలపై ఆరోపించారని తెలిపారు. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను రూ. 7388 కోట్లకే అమ్ముకున్నారని రేవంత్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి మతం ఒక విశ్వాసం మాత్రమే.. కాంగ్రెస్ మతాన్ని రాజకీయాలకు వాడుకోదని రేవంత్ స్పష్టం చేశారు. మత రాజకీయలతో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావాలనుకుందన్నారు. బీజేపీ మత రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారన్నారు. అస్థిర రాజకీయాలతో సుస్థిర రాజకీయాలు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని ఆరోపించారు.
హాంగ్ ఏర్పరచి కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా చేయాలనుకున్నకేసీఆర్ ఎత్తుగడలను కర్ణాటక ప్రజలు చిత్తు చేశారన్నారు. కర్ణాటక ఎన్నికలు రాబోయే తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయన్నారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయన్నారు. నిన్న హిమాచల్, నేడు కర్ణాటక, రేపు తెలంగాణ, భవిష్యత్ లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. కర్ణాటకలో గెలుపుకు కృషి చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు.