Karnataka | 25 ఏళ్ల సంప్రదాయానికి కర్ణాటక చెల్లు చీటీ

గతంలో 1999, 2013 లోనే విస్పష్ట తీర్పు తదుపరి అన్నింటా హంగ్‌ ఫిరాయింపులపై ప్రజల తిరుగుబాటు విధాత: కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేక సందేశాలు ఇస్తున్నాయి. ఆ రాష్ట్ర ఎన్నికల చరిత్రను చూస్తే గత 25 ఏండ్లలో 1999, 2013లోనే ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అదీ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఆ అవకాశం ఇచ్చారు. బీజేపీకి ఎన్నడూ పూర్తి మెజారిటీ రాలేదు. కానీ 2013, 2008లో మాత్రం ఆ పార్టీ అతి పెద్దపార్టీగా […]

  • By: Somu    latest    May 13, 2023 10:33 AM IST
Karnataka | 25 ఏళ్ల సంప్రదాయానికి కర్ణాటక చెల్లు చీటీ
  • గతంలో 1999, 2013 లోనే విస్పష్ట తీర్పు
  • తదుపరి అన్నింటా హంగ్‌
  • ఫిరాయింపులపై ప్రజల తిరుగుబాటు

విధాత: కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేక సందేశాలు ఇస్తున్నాయి. ఆ రాష్ట్ర ఎన్నికల చరిత్రను చూస్తే గత 25 ఏండ్లలో 1999, 2013లోనే ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అదీ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఆ అవకాశం ఇచ్చారు. బీజేపీకి ఎన్నడూ పూర్తి మెజారిటీ రాలేదు. కానీ 2013, 2008లో మాత్రం ఆ పార్టీ అతి పెద్దపార్టీగా అవతరించింది.

కానీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సాధించలేక పోయింది. దీంతో గత రెండుసార్లు అక్కడ సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామ్యపార్టీల మధ్య విభేదాలు, నేతల పార్టీ ఫిరాయింపులతో ప్రజలు విసిగిపోయారు. చాలా పరిమిత వనరులతో చేసే ఎగ్జిట్‌ పోల్స్‌లో ప్రజాభిప్రాయం ప్రతిఫలించకపోయినా.. ఓట్ల లెక్కింపులో ప్రజాభిప్రాయం స్పష్టంగా వ్యక్తమైంది.

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ 1999లో 132 స్థానాలతో సాధించింది. అలాగే 2013లో 122 స్థానాలు గెలుచుకున్నది. ఈసారి ఆ రికార్డులను తిరగరాసింది. 136 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అని నినదించిన బీజేపీకి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. వస్తున్న ఫలితాలను గమనిస్తే ఈ సంఖ్య మరింత పెరిగేలా ఉన్నది.

నిజానికి మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా గుజరాత్‌, యూపీ, ఉత్తరాఖండ్‌, అస్సాం, త్రిపుర మినహా ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఎక్కడా లేదు. అందుకే బీజేపీ 2018లో 104, 2008లో 110 స్థానాల్లో నెగ్గి సాధారణ మెజారిటీకి స్వల్పదూరంలో ఆగిపోయింది. ఈ రెండుసార్లు ‘ఆపరేషన్‌ కమల’ పేరుతో ఇతర పార్టీల్లో చీలిక తెచ్చి అధికారంలోకి వచ్చింది.

కానీ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రభుత్వాలు కావు. 2018 ఎన్నికల్లోనూ మెజారిటీ లేకున్నా హడావుడిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ప్రభుత్వం అసెంబ్లీలో బలనిరూపణలో చేతులు ఎత్తేసి కుప్పకూలింది. అక్కడితో ఆగకుండా మూడేళ్ల కిందట కాంగ్రెస్‌, జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి తిరిగి అధికారంలోకి వచ్చింది. అందుకే ఈసారి కూడా ఇప్పుడు ఎవరు గెలిచినా వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత తిరిగి మా ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలు జాతీయ మీడియా చర్చల్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు అంటే ఆ పార్టీ విధానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి

బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈసారి ఎన్నికల ఫలితాలు చూస్తే గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి పార్టీ ఫిరాయించిన వారికి ప్రజలు గుణపాఠం చెప్పారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ సృష్టించే భావోద్వేగ రాజకీయాలకు దక్షిణదాది రాష్ట్రాల్లో ఫలించవని కన్నడ ప్రజలు తిరస్కరించారు. లౌకిక, శాంతియుత ప్రభుత్వాలవైపే తాము నిలబడుతామని మరోసారి రుజువు చేశారు.

అందుకే ఎన్నికలకు ముందు బీజేపీ ముస్లిం రిజర్వేషర్లు రద్దు చేసి లింగాయత్‌, వొక్కలిగ సామాజికవర్గాలకు పంపిణీ చేసినా ఆయా వర్గాల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధించింది. దీనిద్వారా కులం, మతం ఆధారంగా విభజన, విద్వేష రాజకీయాలతో లబ్ధి పొందాలనుకున్న బీజేపీకి ఓటర్లు బుద్ధి చెప్పారు. ఇక ప్రధాని ప్రచారం చేసిన డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ లో 40 శాతం కమీషన్‌ ఆరోపణలను అధిగమించడానికి బజరంగ్‌దళ్‌ నినాదాన్నితిప్పికొట్టారు.

మత విద్వేషాలతో కర్ణాటకలో గెలిచి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న బీజేపీ నేతల ఆలోచనలను కన్నడ ప్రజలు అడ్దుకున్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న సంక్షేమ, శ్రేయోరాజ్యమే కావాలని కోరుకున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల భారం తగ్గిస్తామన్న, నిరుద్యోగ సమస్య తీరుస్తామన్న, శాంతిభద్రతలు కాపాడుతామన్న కాంగ్రెస్‌ పార్టీకే మరోసారి భారీ విజయాన్ని కట్టబెట్టారు.