నన్ను గెలిపించి.. కాపాడండి: కౌశిక్‌ రెడ్డి

హుజూరాబాద్‌ బీఆరెస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి నియోజకవర్గ ప్రజలను ఏమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసే రీతిలో భార్య, బిడ్డలతో కలిసి తనను గెలిపించాలంటూ విడుదల చేసిన వీడియో వివాదస్పదమవుతుంది

నన్ను గెలిపించి.. కాపాడండి: కౌశిక్‌ రెడ్డి
  • భార్య, బిడ్డలతో కౌశిక్‌ రెడ్డి వీడియో


విధాత : హుజూరాబాద్‌ బీఆరెస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి నియోజకవర్గ ప్రజలను ఏమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసే రీతిలో భార్య, బిడ్డలతో కలిసి తనను గెలిపించాలంటూ విడుదల చేసిన వీడియో వివాదస్పదమవుతుంది. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడినా మీ అందరి మధ్య ఉండి మీకు సేవ చేశానని, ఈ ఒక్కసారి నన్ను గెలిపించండంటూ చేతులు జోడించి ప్రార్థిస్తున్నానంటు ఓటర్లను అభ్యర్థించారు.


ఈ గుండె అలసిపోయింది..బరువెక్కింది..ఈ గుండెను మీరే కాపాడుకోవాలని, ఈ ఒక్కసారికి నాకు ఓటు వేయాలని కౌశిక్‌రెడ్డి కోరారు. ఆయన భార్య సైతం నా కొంగు జాచీ అడుగుతున్నానని, నాభర్తకు ఈ ఒక్కసారి ఓటు భిక్ష వేసి గెలిపించండని వీడియోలో అభ్యర్ధించింది. కూతురు కూడా అందరికి నమస్కారం..మీ అందరికి దండం పెట్టి అడుగుతున్నా.. మా డాడికి ఒక్క చాన్స్‌ ఇచ్చి గెలిపించండి ప్లీజ్‌ అంటూ అభ్యర్ధించారు. కౌశిక్‌ రెడ్డి, ఆయన భార్య, బిడ్డ కన్నీటి పర్యంతంతో చేసిన ఈ వీడియో విజ్ఞప్తి చర్చనీయాంశమైంది.


ఇప్పటికే కౌశిక్‌ రెడ్డి ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్ర యాత్ర ఓడితే నా శవయాత్ర అంటూ ఓటర్లను బ్లాక్ మెయిల్‌ చేసే రీతిలో చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం హుజూరాబాద్‌ ఆర్‌వోను విచారణకు ఆదేశించింది. కౌశిక్‌ రెడ్డి వ్యాఖ్యలపై కమలాపూర్ పోలీసులు స్థానిక ఎంపీడీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగానే భార్య, బిడ్డలతో కలిసి మరోసారి కౌశిక్‌రెడ్డి వీడియో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.