Breaking news:డిశ్చార్జి తర్వాత సొంతింటికి కేసీఆర్!
ప్రస్తుతం యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డిశ్చార్జి తర్వాత తన సొంత ఇంటికి వచ్చే అవకాశం ఉన్నది

- రెడీ అవుతున్న నందినగర్‌లోని నివాసం
- కొత్తగా రంగులు, ఇంటీరియల్ డిజైన్ మార్పు
విధాత: ప్రస్తుతం యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు డిశ్చార్జి తర్వాత తన సొంత ఇంటికి వచ్చే అవకాశం ఉన్నది. దాదాపు తొమ్మిదేండ్లుగా ఖాళీగా ఉన్న ఇంటిని కేసీఆర్ కుటుంబం ఉండటానికి అనుగుణంగా ముస్తాబు చేస్తున్నారు. కొత్తగా రంగులు వేస్తున్నారు. ఇంటీరియల్ డిజైన్లను మార్చుతున్నారు. రెండు రోజులుగా అక్కడ సిబ్బంది పనులు చేస్తున్నారు. కార్మికుల హడావుడి ఎక్కువగా కనిపిస్తున్నది.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు -14 నందినగర్‌లో కేసీఆర్‌కు మూడు అంతస్థుల సొంత నివాసం ఉన్నది. ముఖ్యమంత్రి పదవి చేపట్టకముందు ఈ నివాసంలోనే కేసీఆర్ కుటుంబం ఉన్నది. మెదక్ జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఇటీవల కేసీఆర్ జారి కింద పడటంతో తొంటికి గాయం కాగా, హుటాహుటిన సోమాజిగూడలోని యశోద దవాఖానకు ఆయనను తరలించారు. సీటీస్కాన్‌లో తొంటి విరిగినట్టు గుర్తించిన వైద్యుల బృందం కేసీఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ చేసింది. ప్రస్తుతం కేసీఆర్ దవాఖానలో కోలుకుంటున్నారు.
ఒకటి రెండ్రోజుల్లో కేసీఆర్ దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉన్నది. ఆయన మళ్లీ ఎర్రవెల్లిలోని ఫామ్‌కు కాకుండా నందినగర్‌లోని సొంత నివాసానికి వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తున్నది. బంజారాహిల్స్‌లో ఉన్న కుమార్తె కవిత ఇంటికి కేసీఆర్ వెళ్తారని తొలుత ప్రచారం జరిగింది. సుమారు 500 కార్లు నిలిపేలా నివాసం చూడాలని పార్టీ శ్రేణులను కేసీఆర్ పురమాయించినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇందుకోసం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ముందు అయితే సొంత ఇంట్లోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది.
నాడు గాయపడిన కేసీఆర్‌ను ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించడానికి గంటన్నర నుంచి రెండుగంటల సమయం పట్టింది. డిశ్చార్జి తర్వాత కూడా కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందే అవకాశం ఉంటుంది. మళ్లీ ఎర్రవెల్లికి ఆయనను తీసుకెళ్లడం, ఏదైనా అనుకోని ఎమర్జెన్సీ వస్తే తిరిగి దవాఖానకు తరలించడం కష్టం కాబట్టి నందినగర్ ఇంటికి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది.
నందినగర్‌లో కేసీఆర్ ఉంటే చికిత్సకు, వైద్యులకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది. దవాఖానకు తరలించడం కూడా సులువుగా వీలవుతుంది. అన్ని విధాలుగా నందినగర్ ఇల్లే ఉత్తమమని అందుకే ఇక్కడ ఉండేందుకు కేసీఆర్ మొగ్గుచూపినట్టు విశ్వసనీయ సమాచారం.