బీఆరెస్ నుంచి బరిలోకి మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ నుంచి మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇద్దరు బరిలోకి దిగుతున్నారు.

- నాగర్ కర్నూల్‌కు ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
- మెదక్‌కు ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి
- ప్రకటించిన బీఆరెస్ అధినేత కేసీఆర్
విధాత: పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ నుంచి మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇద్దరు బరిలోకి దిగుతున్నారు. కొంత కాలం క్రితం సర్వీస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఇద్దరు నేతలకు బీఆరెస్ అధినేత కేసీఆర్ బీఆరెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఇందులో ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన సర్వీస్‌కు రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్షులుగా పార్టీ బాధ్యతలు నిర్వహించారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌తో పొత్తు కోసం తీవ్రంగా ప్రవీణ్ కుమార్ యత్నించారు. అయితే మాయావతి పొత్తును వ్యతిరేకించిన తరువాత ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి బీఆరెస్‌లో చేరారు. దీంతో బీఆరెస్ ప్రవీణ్ కుమార్‌కు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఖరారు చేసింది.
సుధీర్ఘకాలం సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన తరువాత కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. తాజాగా మెదక్ ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న వెంకట్రామిరెడ్డిని మెదక్ పార్లమెంటు సీటుకు బరిలోకి దింపాలని నిర్ణయించి ఈ మేరకు టికెట్ ఖరారు చేశారు. ఇలా ఈ ఇద్దరు అధికారులకు శుక్రవారం బీఆరెస్ అధినేత కేసీఆర్ టికెట్ ఖరారు చేశారు.