Kaleshwaram Commission: 11న కాళేశ్వరం కమిషన్ ముందుకు.. కేసీఆర్!

- అంగీకరించిన కమిషన్
- 9న హరీష్ రావు హాజరు
విధాత, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరు తేదీ మారింది. నోటీసులలో పేర్కొన్నట్లుగా తాను ఈ నెల 5వ తేదీన కాకుండా 11వ తేదీన విచారణకు హాజరవుతానని కేసీఆర్ కమిషన్ కు సమాచారం అందించారు. ఇందుకు కమిషన్ కూడా అంగీకరించింది. నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు తనకు మరింత సమయం కావాలన్న కేసీఆర్ అభ్యర్థనను కమిషన్ సరేననడంతో.. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇవ్వాల్సిన సమాధానంపై సుధీర్ఘ కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే మాజీ మంత్రి టి.హరీష్ రావు మాత్రం ఈ నెల 9వతేదీన కమీషన్ ముందు హాజరు కానున్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వాయిదా వేశారు. కాగా మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈనెల 6న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ 200మందికి పైగా విచారించి ఇప్పటికే 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలలో కొనసాగిన మాజీ సీఎస్.సోమేష్‌కుమార్, స్మిత సబర్వాల్, రజత్‌కుమార్ వంటి వారిని బహిరంగ విచారణకు పిలిచింది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కాళేశ్వరంగా రూపాంతరం చెందడం మొదలు, ప్రాజెక్టు డిజైన్‌లు, అనుమతులు, నిధులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసింది. ముఖ్య ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచడంపై ఆరా తీసింది. నిర్మాణం పూర్తి కాకుండానే బకాయిల చెల్లింపుపై కూడా కూపీలాగింది. కేసీఆర్, హరీష్ రావు, విచారణలతో కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకం పూర్తి కానుంది.