Kejriwal | జైలుకు వెళ్లినా కేజ్రీవాలే ఢిల్లీకి సీఎం అంటున్న ఆప్‌.. అదెలా సాధ్యం..?

Kejriwal | జైలుకు వెళ్లినా కేజ్రీవాలే ఢిల్లీకి సీఎం అంటున్న ఆప్‌.. అదెలా సాధ్యం..?

Kejriwal : ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రివాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసినా.. ఆయన మా సీఎం అని ఆప్‌ చెబుతోంది. కేజ్రివాల్ జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారని ప్రకటించింది. కేజ్రీవాల్‌ అరెస్టయిన తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆప్‌ ఈ ప్రకటన చేసింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఈడీ గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకుంది.

‘అర్వింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పుడు, ఇక ముందు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఈ విషయంలో ఇంకో మాట లేదు’ అని ఢిల్లీ మంత్రి, ఆప్‌లో నెంబర్‌ 2గా ఉన్న అతిషి చెప్పారు. ‘కేజ్రివాల్‌ ఒకవేళ జైలుకు వెళ్తే జైలు నుంచే బాధ్యతలు నిర్వహిస్తారని మేం ముందు నుంచే స్పష్టంగా చెబుతున్నాం. జైలు నుంచి పాలన చేయకుండా ఆయనను ఏ చట్టం అడ్డుకోలేదు. ఎందుకంటే ఆయన దోషి కాదు’ అని అతిషి అన్నారు.

కానీ, ఒక కేసులో అరెస్టయిన వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి రాజ్యాంగం ఒప్పుకోదని నిపుణులు చెబుతున్నారు. అందుకే గతంలో లాలూ యాదవ్ బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాణా కుంభకోణంలో అరెస్టయితే ఆయన భార్య రబ్రీదేవికి బాధ్యతలు అప్పగించారని, ఇటీవల జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను అరెస్ట్ చేస్తే.. పార్టీలోని మరో వ్యక్తిని సీఎంను చేశారని గుర్తు చేస్తున్నారు.

ఒకవేళ కేజ్రీవాల్‌ జైల్లో నుంచే ముఖ్యమంత్రిగా కొనసాగాలని అనుకున్నా ఆయన బాధ్యతల నుంచి తప్పించే అధికారం కేంద్ర హోంశాఖకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు ఏదైనా కేసులో అరెస్టయితే తక్షణమే వారిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తారని, రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రికి కూడా అదే నిబంధన వర్తిస్తుందని అంటున్నారు.

ఇదిలావుంటే జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చనేది మా జైలు మాన్యువల్‌లో లేదని, తాము మాన్యువల్‌ ప్రకారమే నడుచుకుంటామని తీహార్‌ జైలుకు చెందిన ఉన్నతాధికారులు చెబుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాగా, లిక్కర్‌ పాలసీ కేసులో విచారించేందుకు 9 సార్లు నోటీసులు పంపినా లెక్కచేయకపోవడంతో ఈడీ గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసింది. అరెస్ట్‌ను అడ్డుకునే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దాంతో కేజ్రీవాల్ టీమ్‌ బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కాగా, ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌.. బీఆర్‌ఎస్‌ నాయకురాలు కే కవితతో కలిసి కుట్ర పన్నారని ఈడీ చెబుతోంది. వారి కుట్రకు అనుగుణంగా మనీశ్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌ పాలసీలో మార్పులు చేసినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటోంది.