టీఎస్‌పీఎస్సీకి మరో సభ్యురాలి రాజీనామా
టీఎస్‌పీఎస్సీ సభ్యురాలు కోట్ల అరుణ కుమారి వ్యక్తిగత కారణాలతో శనివారం తన పదవికి రాజీనామా సమర్పించారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించారు

పాత సభ్యుల రాజీనామాలు పూర్తి
విధాత : టీఎస్‌పీఎస్సీ సభ్యురాలు కోట్ల అరుణ కుమారి వ్యక్తిగత కారణాలతో శనివారం తన పదవికి రాజీనామా సమర్పించారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించారు. టీఎస్‌పీఎస్సీలో జరిగిన తప్పులకు తనకు సంబంధం లేకపోయినప్పటికి కొత్త బోర్డు ఏర్పాటుకు అనుకూలంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఆమె పేర్కోన్నారు. గతంలో తాను, తన భర్త ప్రభుత్వ భూములను కాపాడిన క్రమంలో లబ్ధి పొందలేని పెద్ద నేతలు కొందరూ మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
కాగా అరుణ కుమారి రాజీనామాతో గత కేసీఆర్ ప్రభుత్వంలో నియమితులైన చైర్మన్ తో పాటు సభ్యులంతా రాజీనామాలు చేసినట్లయ్యింది. తొలుత చైర్మన్, ఐదుగురు సభ్యులు రాజీనామా చేయగా, ఇటీవల సుమిత్రానందన్ తన రాజీనామా సమర్పించారు. ఆమె రాజీనామాకు గవర్నర్ ఇంకా అమోదం తెలుపలేదు. తాజాగా అరుణకుమారి సైతం తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. దీంతో వీరిద్దరి రాజీనామాలు ఆమోదం పొందితే కేసీఆర్ ప్రభుత్వం నియమించిన కమిషన్ స్థానంలో పూర్తి స్థాయిలో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. ఇప్పటికే టీఎస్ పీఎస్సీకి కొత్త చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని, సభ్యులుగా అనితా రాజేంద్ర, అమీరుల్లాఖాన్ నర్రీ యాదయ్య, వై. రాంమోహన్ రావు, పాల్వాయి రజనీకుమారీలను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది. సుమితానందన్, అరుణ రాజీనామాలను గవర్నర్ ఆమోదిస్తే వారి స్థానంలోకూడా కొత్త సభ్యులను నియమిస్తారు. టీఎస్ పీఎస్సీ కి చైర్మన్ తో కలిపి మొత్తం 11 మంది సభ్యులను నియమించుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటిదాకా చైర్మన్ సహా ఆరుగురి సభ్యులను నియమించింది.