IMF | భారత్ వద్దన్నా.. పాక్‌కు వన్ బిలియన్ డాలర్ల IMF రుణం!

  • By: sr    news    May 10, 2025 7:26 PM IST
IMF | భారత్ వద్దన్నా.. పాక్‌కు వన్ బిలియన్ డాలర్ల IMF రుణం!

న్యూఢిల్లీ : పాకిస్థాన్ కు అప్పు ఇవ్వొద్దని భారత్ చెప్పినా ఆ దేశానికి ఐఎంఎఫ్ రుణం మంజూరు చేయడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది. తాజాగా జరిగిన ప్రపంచ బ్యాంకు సమీక్ష సమావేశంలో 1 బిలియన్ డాలర్ల (రూ.8,540కోట్లు)ను మంజూరు చేసింది. ఎక్స్ టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) కింద ఈ మొత్తాన్ని ఐఎంఎఫ్ మంజూరు చేసింది. భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్తత వేళ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పాక్ అత్యవసరంగా బెయిలౌట్ కోరుతూ ఐఎంఎఫ్ ను ఆశ్రయించింది. పాక్ కు రుణం ఇస్తే ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తుందని ఐఎంఎఫ్ ఎదుట భారత్ వాదించింది.

పాక్ దేశానికి రుణంపై జరిగిన ఓటింగ్ ని భారత్ బహిష్కరించింది. అంతకుముందే పాక్ – ఐఎంఎఫ్ కు మధ్య 7బిలియన్ డాలర్ల రుణానికి సంబంధించి మార్చి 25న కీలక ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా పాక్ ఐఎంఎఫ్ పెట్టిన షరతులకు తలొగ్గింది. ఐఎంఎఫ్ గత ఐదేళ్లలో నాలుగుసార్లు పాక్ కు బెయిలౌట్ రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించింది. పాక్ కు రుణంఇస్తే ఉగ్రవాదానికి అనుకూలంగా వినియోగిస్తుందని భారత్ గతంలో కూడా తన వాదన వినిపించింది.

తాజాగా మరోసారి పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ రుణం అందించడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తుంది. పాకిస్తాన్ కు ఆర్థిక సహాయం చేయడం అంటే యుద్ధానికి ఆయుధాలు ఇవ్వడమేనని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు కూడా తమ ఆలోచన వైఖరి మార్చుకోవాలని..ఇది నవ భారతమని…ఆ దేశాలు ఇంకా తమ నోరు మూయించలేవని స్పష్టం చేశారు. మా దేశ పౌరుల కంటే మాకు ఏది ఎక్కువ కాదు అని జైశంకర్ అన్నారు.

పాకిస్తాన్ కు రుణం.. ఉగ్రసంస్థకు ఇచ్చినట్లే: ఒవైసీ

పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ రుణం ఇవ్వడాన్ని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. పాక్ కు రుణం ఇవ్వడమంటూ ఉగ్రవాద సంస్థకు రుణం ఇవ్వడమేనని ఒవైసీ విమర్శించారు. పాకిస్తాన్ నిబంధనల మేరకు ఆ రుణాన్నిపేదరిక నిర్మూలనకు, పోలియోపై పోరాటానికి, మహిళల సాధికారతకు ఉపయోగించదని..కేవలం భారత్ కు వ్యతిరేకంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచేందుకే వినియోగిస్తుందని విమర్శించారు. పాకిస్తాన్ కు రుణం ఇవ్వడంపై పశ్చిమ దేశాలు మౌనంగా ఎందుకు ఉన్నాయో అర్థం కావడం లేదని..ఉగ్రవాదానికి సమకూరుస్తున్న నిధులు అని తెలిసే అమెరికా, కెనడా, జర్మనీ దేశాలు మౌనంగా ఉన్నాయన్నారు. పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ కంట్రీ అని దాని వల్ల కలిగే ప్రమాదాన్ని ప్రపంచం గుర్తించాలని సూచించారు పాక్ వద్ద ఉన్న అణ్వాయుధానలను నిర్వీర్యం చేయించాలని..లేకపోతే ఆ దేశం మానవాళికి ముప్పు అని ఒవైసీ ఘాటుగా వ్యాఖ్యనించారు.

తప్పుబట్టిన కాంగ్రెస్

పాక్ కు ఐఎంఎఫ్ రుణ మంజూరు వివాదంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ స్పందిస్తూ పహల్గామ్ దాడి తర్వాతా కూడా పాక్ కు ఐఎంఎఫ్ రుణం మంజూరు చేయడం షాక్ కు గురి చేసిందన్నారు. ఈ రుణం పాకిస్తాన్ లో శాశ్వత సైనిక పాలనకు దోహదం చేస్తుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ పాకిస్తాన్ రుణం ఆమోదంపై జరిగిన ఓటింగ్ లో భారత్ ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదంటూ ప్రశ్నించారు. తాము వ్యతిరేకంగా ఓటు వేయాలని డిమాండ్ చేస్తే కేంద్రం మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉందని తప్పుబట్టారు. వ్యతిరేకంగా ఓటు చేసి ఉంటే అంతర్జాతీయ సమాజంలో బలమైన సందేశం వెళ్లి ఉండేదని అభిప్రాయ పడ్డారు. అయితే అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మాత్రం కాంగ్రెస్ నేతు వాదనను తోసిపుచ్చారు. పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ రుణంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.