ఉచిత ఎల్‌ఆర్‌ఎస్ కోసం 6న ధర్నాలు

ఎల్‌ఆర్‌ఎస్‌కు ఫీజులు వసూలు చేయడానికి నిరసనగా ఈ నెల 6న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని బీఆరెస్ పార్టీ నిర్ణయించినట్లుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.

  • By: Somu    latest    Mar 04, 2024 11:38 AM IST
ఉచిత ఎల్‌ఆర్‌ఎస్ కోసం 6న ధర్నాలు
  • ఎల్‌ఆరెఎస్ ఫీజులపై నిలదీయాలి
  • బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు


విధాత, హైదరాబాద్: ఎల్‌ఆర్‌ఎస్‌కు ఫీజులు వసూలు చేయడానికి నిరసనగా ఈ నెల 6న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని బీఆరెస్ పార్టీ నిర్ణయించినట్లుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు ఫీజలు వసూలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపనున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని విమర్శించారు.


ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేస్తామని చెప్పారని, అయితే అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు మాటమార్చారని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు రెండు నాల్కల ధోరణి అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచితంగా ఎల్‌ఆరెస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 6న నియోజకవర్గం కేంద్రాల్లో ధర్నాలతో పాటు హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ ఆఫీస్‌ ముందు ధర్నా చేస్తామన్నారు. 7న కలెక్టర్లు, ఆర్డీవోలకు విజ్ఞాపన పత్రాలు ఇస్తామని చెప్పారు.


ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టాలని అడుగుతున్న అధికారులను ప్రజలు నిలదీయాలని కేటీఆర్‌ ప్రజలకు, బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆరెస్‌ పాలనలో ప్రతి విషయంపై కాంగ్రెస్ ఆరోపణలు చేసిందన్నారు. అయితే తమ ప్రభుత్వ పథకాలనే ప్రస్తుత సర్కారు కొనసాగిస్తున్నదని, ఇందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకమే దీనికి ఉదాహరణ అని గుర్తు చేశారు. నాడు ఎల్‌ఆర్‌ఎస్‌పై అప్పటి ఎంపీ, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోర్టులో కేసు వేశారని, కోమటిరెడ్డి కోర్టు కేసుకు సంఘీభావం తెలుపుతున్నానని చురకలేశారు.


నామినల్‌ ఫీజులతో భూములను రెగ్గులరైజ్‌ చేయడానికి అప్పుడు అవకాశం ఇచ్చామని, ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తామని ఇప్పటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, ఎవరూ ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టొద్దని భట్టి పిలుపునిచ్చారని.. ఉచితంగా భూములను రెగ్యులరైజ్‌ చేస్తామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పారని, నో ఎల్‌ఆర్‌ఎస్‌.. నో బీఆరెస్‌ అని ఉత్తమ్‌ అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజల రక్తమాంసాలు పీలుస్తున్నారని సీతక్క ఆనాడు అన్నారని, ఇప్పుడు ఎల్‌ఆరెస్ ఫీజుల వసూళ్లపై భట్టి, ఉత్తమ్‌, సీతక్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


మార్చి 31 కల్లా ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టి తీరాలని ప్రజల మెడమీద కత్తి పెట్టారని, ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు వసూలు చేయడానికి సిద్దపడ్డారని, ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఖజానా నింపడానికే అన్నట్లుగా ఉందని విమర్శించారు. దీనివల్ల 24 లక్షల పైచిలుకు కుటుంబాలకు భారం పడుతుందని, ఒక్కో కుటుంబంపై లక్ష రూపాయల పైచిలుకు భారం పడుతుందని, కాంగ్రెస్‌ చెప్పినట్లు ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా చేయాలని, రిజిస్ట్రేషన్‌ అయిన స్థలాలకు మళ్లీ ఎందుకు డబ్బులు కట్టాలన్న ఆనాటి భట్టి డిమాండునే నేను పునరుద్ఘాటిస్తున్నానని కేటీఆర్ చెప్పారు.