కేటీఆర్, కోమటిరెడ్డి, రేవంత్‌ల ట్విట్టర్ వార్‌

  • Publish Date - September 30, 2023 / 11:49 AM IST
  • ఎన్నికల పన్నుపై వాగ్వాదం


విధాత : మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై చేసిన విమర్శలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌లు ధీటుగా ప్రతిస్పందిస్తుండగా వారి మధ్య ట్విట్టర్ వేదికగా వాగ్వాదం సాగుతుంది. కాంగ్రెస్ ఎన్నికల హామీల కోసం బెంగుళూర్ బిల్డర్లకు చదరపు అడుగుకు 500రూపాయల చొప్పున పన్ను విధిస్తుందని ఇది రాజకీయ ఎన్నికల పన్ను అని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రాండ్ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్ స్కామ్‌ల వారసత్వలో స్కామ్ కాంగ్రెస్‌గా మారిందని విమర్శించారు.


కాగా.. కేటీఆర్ విమర్శలపై ట్విట్టర్‌లోనే ప్రతిస్పందించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆరెస్ అంటేనే దీ లూట్‌..సూట్ సర్కార్ అని ప్రతిదాడి చేశారు. బీఆరెస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఆ పార్టీ, కుటుంబం కోసం 1000కోట్ల కల్వకుంట్ల కమిషన్‌(కే) పన్ను వేసిందని విమర్శించారు. ఫ్యామిలీ ఫస్ట్ పీపుల్స్ లాస్ట్ బీఆరెస్ ఎజెండాగా పనిచేస్తుందంటూ దుయ్యబట్టారు.


ఇక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కేటీఆర్‌కు మరింత ఘాటుగా కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలి జ్వరం పట్టుకుంటే, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నడని రాసుకొచ్చారు. నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంపై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ కల్వకుంట్ల స్కామ్‌లీ గురించి చెప్పు అని రేవంత్ పేర్కొన్నారు.


దళిత బంధులో 30 శాతం కమీషన్లు దండుకుంటున్నమని స్వయంగా మీ అయ్యనే ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు, లిక్కర్ స్కామ్ లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసిందని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు అని విమర్శించారు. అలాగే భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు అన్నారు.


తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నరో, ఎన్నిఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో, ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నరో, ఎన్ని లక్షల చదరపు అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తామన్నారు. కాంగ్రెస్ ను అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు అని ఘాటుగా స్పందించారు.