KTR, Revanth | ఇక రైతు వేదికలపై విద్యుత్తు పంచాయితీ..

KTR, Revanth కేటీఆర్.. రేవంత్ పిలుపులతో ముదరనున్న ఉచిత విద్యుత్తు రచ్చ గ్రామాల్లో ఉద్రిక్తతలకు అవకాశం నేటీ నుండి రైతు వేదికల సమావేశాలు… కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు విధాత: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్, బీఆర్ ఎస్‌ మధ్య సాగుతున్న పంచాయితీ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ విధానాలను రైతు వేదికలలో సమావేశాలు నిర్వహించి ఎండగట్టాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు ఒక వైపు… రైతు రుణమాఫీ సహా […]

KTR, Revanth | ఇక రైతు వేదికలపై విద్యుత్తు పంచాయితీ..

KTR, Revanth

  • కేటీఆర్.. రేవంత్ పిలుపులతో ముదరనున్న ఉచిత విద్యుత్తు రచ్చ
  • గ్రామాల్లో ఉద్రిక్తతలకు అవకాశం
  • నేటీ నుండి రైతు వేదికల సమావేశాలు…
  • కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు

విధాత: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్, బీఆర్ ఎస్‌ మధ్య సాగుతున్న పంచాయితీ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ విధానాలను రైతు వేదికలలో సమావేశాలు నిర్వహించి ఎండగట్టాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు ఒక వైపు… రైతు రుణమాఫీ సహా రైతాంగ సమస్యలపై రైతు వేదికలకు వచ్చే బీఆర్ ఎస్ నేతలను నిలదీయాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోవైపు ఇచ్చిన పిలుపులతో రెండు పార్టీల మధ్య సాగుతున్న ఉచిత విద్యుత్తు పంచాయితీ మరింత ముదిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

95శాతం మంది రైతులకు మూడు నుండి ఎనిమిది గంటల ఉచిత విద్యుత్ చాలన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే అస్త్రాలుగా చేసి కాంగ్రెస్ పైకి సంధిస్తున్న బీఆర్ ఎస్‌ నాయకత్వం విద్యుత్తు పంచాయితీలో తగ్గేదేలే లేదంటుంది. రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు వేదికల వద్ద పది రోజులపాటు సమావేశాలు నిర్వహించి రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానాలు చేయాలని మంత్రి కేటీఆర్ బీఆర్ ఎస్ శ్రేణులను ఆదేశించారు.

24 గంటల ఉచిత విద్యుత్తుకు కాంగ్రెస్ వ్యతిరేకమన్న వాదనను రైతులలోకి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇదే సమయంలో రైతు వేదికలను రాజకీయ వేదికలుగా మార్చి బీఆర్ ఎస్ రాజకీయం చేసేందుకు వస్తుందని, రైతు రుణమాఫీతో పాటు ధాన్యం కొనుగోలు సమస్యలు సహా సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై వారిని నిలదీయాలంటు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

రాజకీయ రచ్చకు రైతు వేదికలు

మంత్రి కేటీఆర్ నిర్దేశం… రేవంత్ నిలదీతల పిలుపులతో రైతు వేదికల సమావేశాలు ఉద్రిక్తతలకు నెలవై గ్రామాల్లో అగ్గిరాజేసేటట్లుగా ఉందన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. రైతుల్లో కాంగ్రెస్, బీఆరెస్‌ వారితోపాటు పలు పార్టీల వారు, యువత కూడా ఉంటారు. కేటీఆర్‌ ఆదేశాల మేరకు 24 గంటల ఉచిత విద్యుత్తు పై రైతు వేదికలలో జరిగే సమావేశాల్లో బీఆరెస్‌ వ్యతిరేక రైతు వర్గాలన్నీ క్షేత్రస్థాయిలో 24 గంటలు విద్యుత్ సరఫరా జరగడం లేదన్న అంశంపై రగడకు దిగవచ్చు.

అదే జరిగితే రైతు వేదిక సమావేశాలు పరస్పర ఘర్షణలకు దారి తీయవచ్చు అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్, బీఆరెస్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా వాదనలు రేగడంతో పాటు కాంగ్రెస్ రైతు పథకాలపై, బీఆరెస్‌ రైతు పథకాలపై వాగ్వివాదం కూడా జరిగే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో రైతు వేదిక సమావేశాలలో విద్యుత్తు అంశంపై చర్చ గ్రామాల్లో ఉద్రిక్తతలకు దారి తీయవచ్చన్న వాదన వినిపిస్తుంది.

ఎమ్మెల్యేలదే బాధ్యత..తీర్మానాలకు పాట్లు

వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రేపటి నుండి రైతు వేదికలలో నిర్వహించాల్సిన సమావేశాల బాధ్యతను మంత్రి కేటీఆర్‌ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాఫ్రతినిధుల మీద పెట్టారు. ప్రతి రైతు వేదికలలో కనీసం వేయి మంది రైతులతో సమావేశాలు నిర్వహించి సాగుకు ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్‌ విధానాన్నినిరసిస్తు రైతులతో తీర్మానాలు చేయించాలని ఎమ్మెల్యేలను పురమాయించారు.

కాంగ్రెస్‌ పార్టీకి మద్దతునిస్తే ఉచిత విద్యుత్ రద్దు చేస్తుందని, మూడు గంటల కరెంటు కావాలా? మూడు పంటల కేసీఆర్ 24గంటల కరెంటు కావాలా ? కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా ? రైతుల జీవితాల్లో వెలుగు నింపిన బీఆరెస్‌ కావాలా ? అంటు రైతులను కోరుతూ, ఉచిత విద్యుత్తుకు వ్యతిరేకంగా
మాట్లాడిన కాంగ్రెస్ రైతులకు క్షమాపణలు చెప్పాలని తీర్మానాలు చేయాలని కేటీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు. కాంగ్రెస్ పాలనలో పడిన కరెంటు కష్టాలు.. బీఆరెస్‌ పాలనలో 24 గంటలు ఉచిత విద్యుత్తు ఫలితాలను రైతులకు వివరించాలని కేటీఆర్‌ ఆదేశించారు.

ఇప్పటికే 24గంటల ఉచిత విద్యుత్తు పై కాంగ్రెస్‌ టార్గెట్‌గా సాగుతున్న రాజకీయ దాడిలో భాగంగా మంత్రి టీ.హరీశ్‌రావు రెఫరండంకు సిద్ధమా అంటు కాంగ్రెస్‌కు సవాల్‌ విసరగా, దానికి సై అన్న పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి గ్రామాల్లో రచ్చబండ సభలు పెట్టి రైతుల అభిప్రాయం సేకరిద్దామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తు రాని గ్రామాల్లో మీరు ఓట్లు అడగొద్దని, వచ్చే గ్రామాల్లో మేము అడగమంటూ ప్రతి సవాల్ విసిరారు.

మంత్రి జగదీశ్ రెడ్డి 24 గంటల ఉచిత విద్యుత్తు పై కాంగ్రెస్ జాతీయ విధానం ఏమిటంటు నిలదీశారు. మంత్రి కేటీఆర్ మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ మూడు గంటల కరెంటు కావాలా లేక కేసీఆర్ మూడు పంటల కరెంటు కావాలా అన్న అంశంపై సింగిల్ పాయింట్ ఎజెండాతో ఎన్నికలకు సిద్దమా అంటు మరో సవాల్ విసిరారు.

ఇప్పటిదాకా పార్టీల వారిగా నిరసనలు, మాటల యుద్ధానికి పరిమితమైన 24గంటల ఉచిత విద్యుత్తు వ్యవహారం ఇక రేపటి నుండి రైతు వేదికల సమావేశాలతో గ్రామాలలోకి వెలుతుండటంతో విద్యుత్తు పంచాయతీ మునుముందు మరెన్ని మలుపులు తీసుకోనుందోనన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది.