Lalu Prasad | మోదీ.. నిష్క్రమణ తథ్యం: లాలు ప్రసాద్‌

Lalu Prasad రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే జనాన్ని మభ్యపెట్టే చర్యలు జీ20 సదస్సుతో దేశానికేంటి? ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ దియోఘర్‌ : రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీ నిష్క్రమణ ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత, మాజీ కేంద్రమంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ చెప్పారు. ఎన్నికలకు ముందు మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలకు మోదీ పాల్పడుతున్నారని ఆరోపించారు. జీ20 సదస్సు ద్వారా భారతదేశ ప్రజలకు కలిగిన లాభమేంటని నిలదీశారు. సోమవారం జార్ఖండ్‌లోని దియోఘర్‌ జిల్లాలో బాబా బైద్యనాథ్‌ […]

  • By: Somu    latest    Sep 11, 2023 12:19 AM IST
Lalu Prasad | మోదీ.. నిష్క్రమణ తథ్యం: లాలు ప్రసాద్‌

Lalu Prasad

  • రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే జనాన్ని మభ్యపెట్టే చర్యలు
  • జీ20 సదస్సుతో దేశానికేంటి?
  • ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌

దియోఘర్‌ : రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీ నిష్క్రమణ ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత, మాజీ కేంద్రమంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ చెప్పారు. ఎన్నికలకు ముందు మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలకు మోదీ పాల్పడుతున్నారని ఆరోపించారు. జీ20 సదస్సు ద్వారా భారతదేశ ప్రజలకు కలిగిన లాభమేంటని నిలదీశారు. సోమవారం జార్ఖండ్‌లోని దియోఘర్‌ జిల్లాలో బాబా బైద్యనాథ్‌ ధామ్‌ ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దేశ వర్తమాన రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేశంలో పరిస్థితి ఏమీ బాగోలేదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. ప్రజలు ఆకలితో చచ్చి పోతున్నారు. ఎన్నికలు వస్తుండటంతో ప్రధాని మోదీ మరోసారి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ఆయన నిష్క్రమణ ఖాయం’ అని చెప్పారు. వంటగ్యాస్‌ ధరలను తగ్గించడం ఇందులో భాగమేనని విమర్శించారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాలు చవి చూసిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని చెప్పారు. రాజ్యాంగం, పేద ప్రజలు, నిరుద్యోగులు, బీఆర్‌ అంబేద్కర్‌కు హాని కలుగనీయం. అంబేద్కర్‌ పేరును తుడిచిపెట్టేయాలని బీజేపీ కోరుకుంటున్నది’ అని ఆయన చెప్పారు. భారతదేశంలో జీ20 సదస్సు నిర్వహించడం సిగ్గుచేటన్న లాలు.. దీన్ని నిర్వహించడం వల్ల దేశ సాధారణ ప్రజలకు ఒరిగిందేంటని ప్రశ్నించారు.

దీని నిర్వహణ కోసం భారీ ఎత్తున ఖర్చు చేశారని విమర్శించారు. ఈ నెల 13న న్యూఢిల్లీలో నిర్వహించే ‘ఇండియా’ కూటమి తొలి సమన్వయ కమిటీ సమావేశంతో 28 ప్రతిపక్ష పార్టీఉ పనిని ప్రారంభిస్తాయని చెప్పారు. కూటమికి ఏకాభిప్రాయంతో నేతను ఎన్నుకుంటామని తెలిపారు. 14 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఇండియా సమన్వయ కమిటీ.. ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ నివాసంలో నిర్వహించనున్నారు. భవిష్యత్తు కార్యక్రమాలు, వ్యూహాల అమలుపై చర్చిస్తారు.