CJI: న్యాయవాద వృత్తిలో మానవీయ కోణం ఉండాలి: జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

అప్పుడే ప్రజలకు న్యాయం అందుతుంది  లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ విధాత: న్యాయవాద వృత్తిలో మానవీయ కోణం (Human Angle) ఉంటేనే ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (CJI of India DY Chandrachud) అన్నారు. నల్సార్‌ లా విశ్వవిద్యాలయం (Nalsar Law University) ఈ ఏడాదితో 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ ఏట అడుగిడుతున్న సందర్భంగా […]

  • Publish Date - February 25, 2023 / 12:43 PM IST

  • అప్పుడే ప్రజలకు న్యాయం అందుతుంది
  • లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో..
  • సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

విధాత: న్యాయవాద వృత్తిలో మానవీయ కోణం (Human Angle) ఉంటేనే ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (CJI of India DY Chandrachud) అన్నారు. నల్సార్‌ లా విశ్వవిద్యాలయం (Nalsar Law University) ఈ ఏడాదితో 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ ఏట అడుగిడుతున్న సందర్భంగా శనివారం జరిగిన 19వ స్నాతకోత్సవానికి (Convocation) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఈ ఏడాది పట్టభద్రులైన న్యాయ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.

అలా చేస్తేనే ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదులు, న్యాయమూర్తులు కేసుల పరిశీలన సమయంలో మానవీయ కోణంతో ఆలోచించాలని కోరారు. మానవీయ దృక్పథంలో ఆలోచిస్తేనే ప్రజలకు న్యాయం చేయగలుగుతామన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు, యువ న్యాయవాదులంతా తమ వద్దకు వచ్చే వివాదాలను మానవీయ కోణంలో పరిశీలించి, పరిష్కరించాలని కోరారు.

ఒక్క న్యాయవ్యవస్థలో ఉన్న వాళ్లే కాదు.. చట్టాలను రూపొందించే శాసన కర్తలు, అమలు చేసే అధికార వ్యవస్థతో పాటు ప్రజాస్వామ్యంలో కీలకమైన అన్ని వ్యవస్థలు ప్రజల జీవితాల్లో నుంచి చూసి, పరిశీలిస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు.

అంద‌రినీ క‌లుపుకొని పోవాలి..

విశ్వ విద్యాలయాలు, న్యాయ కళాశాలలు మానవీయతతో మెలగాలన్నారు. అలా ఉన్నప్పుడే మెరుగైన విద్య అందుతుందని తెలిపారు. కళాశాలల్లో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారని తక్కువతో చూసే పద్ధతి ఉండకూడదని హితవు పలికారు.

అందరినీ కలుపుకొని పోయేలా, ప్రోత్సహించేలా సహాయానుభూతితో వ్యవహరించాలని కోరారు. న్యాయవాద విశ్వవిద్యాలయాలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని జస్టిస్‌ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

న్యాయ క‌ళాశాల‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హించేలా…

ఎట్టి పరిస్థితిలోనూ సాధారణ ప్రజలకు (Common People) దూరం కావొద్దని చెప్పారు. లా యూనివర్సిటీల్లో అధిక ఫీజులు ఉండకూడదని అన్నారు. న్యాయ వర్సిటీలు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఉండకూడదని, ఎక్సలెంట్‌ ఇన్‌స్టిట్యూషన్‌లుగా ఉండాలని సూచించారు.

నల్సార్‌ లా యూనివర్సిటీ అన్ని న్యాయ కళాశాలలకు నాయకత్వం వహించే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ నర్సింహ, జస్టిస్‌ రామసుబ్రమణ్యం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Latest News