Karimnagar: మోడికి.. సింగరేణి సెగ తగిలేలా జంగ్ సైరన్ మోగించాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్
సింగరేణి.. కంపెనీ మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారం బొగ్గు బ్లాకుల వేలానికి బిజేపి ప్రభుత్వం కుట్రలు విధాత బ్యూరో, కరీంనగర్: సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నా నిరసన సెగలు హైదరాబాద్‌కు వస్తున్న నరేంద్ర మోడీకి తాకాలని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై సింగరేణి జంగ్ సైరన్ మోగించాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు సింగరేణిలో నిర్వహించే యుద్ధ […]

- సింగరేణి.. కంపెనీ మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారం
- బొగ్గు బ్లాకుల వేలానికి బిజేపి ప్రభుత్వం కుట్రలు
విధాత బ్యూరో, కరీంనగర్: సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే మహాధర్నా నిరసన సెగలు హైదరాబాద్‌కు వస్తున్న నరేంద్ర మోడీకి తాకాలని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై సింగరేణి జంగ్ సైరన్ మోగించాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు సింగరేణిలో నిర్వహించే యుద్ధ భేరి మహాధర్నా నిర్వహణపై గోదావరిఖని టిజిబికెఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రం కుట్రపూరితంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకువచ్చిందన్నారు. సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలు ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరుతున్నా పట్టించుకోకుండా మరోసారి సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణ పల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు.
మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. సింగరేణి ఒక కంపెనీ మాత్రమే కాదని.. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారమని, ఇక్కడి ప్రజలకు ఇదే ప్రధానమైన బతుకుదెరువన్నారు.
తెలంగాణను దెబ్బ కొట్టాలని, ఇక్కడి ప్రజల బతుకులు ఆగం చేయాలనే దురుద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం పదేపదే సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు కొనసాగిస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను బిఆర్ఎస్ తరపున, తెలంగాణ ప్రభుత్వం పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. లాభాల బాటలో వున్న సింగరేణికి.. భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా, నష్టాల బాట పట్టించాలన్న కుతంత్రంలో భాగమే బొగ్గు గనుల వేలం అన్నారు. నవంబర్ 12, 2022న రామగుండం పర్యటన సందర్భంగా సాక్షాత్తూ ప్రధానమంత్రే సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించమని మాటిచ్చి, తప్పారని మంత్రి దుయ్యబట్టారు.
సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పైకోమాట చెప్తూ.. లోపల కుట్రకు తెర లేపుతోందన్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికో పాలసీ అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నామినేషన్ పద్ధతిన భారీగా లిగ్నైట్ గనులు కేటాయించిందన్నారు. ప్రధాని మోడీ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న సీఎం కేసిఆర్ సంకల్పాన్ని ఎలాగైనా దెబ్బతీయాలన్న కేంద్రం కుట్ర ఇందులో దాగి ఉందని మండిపడ్డారు. బోర్లపై ఆధారపడ్డ అన్నదాతల బతుకులు మళ్లీ బోర్లాపడేలా చేయాలన్నదే బీజేపీ ఉద్దేశమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపు, గౌరవాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతోందన్నారు.
ఇప్పటికే సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రలపైన ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. శనివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో చేపట్టే యుద్దభేరి మహాధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం లో రామగుండం నగర మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, టిబిజికేఏస్ నాయకులు మిరియాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, బాదావత్ శంకర్ నాయక్, కుమ్మరి శ్రీనివాస్, ఎన్వి రామణారెడ్డి, కల్వచర్ల కృష్ణవేణి, భూమయ్య, జనగామ కవిత సరోజిని, దాతు శ్రీనివాస్, నాయకులు పి.టి స్వామి, మూల విజయ రెడ్డి, అయలి శ్రీనివాస్, గండ్ర దామోదర్ రావు, జాహెద్ పాషా, అచ్చ వేణు, చెలకలపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, పాతపెల్లి ఎల్లయ్య, శేషగిరి, రాకం వేణు, గంగ శ్రీనివాస్, కాల్వ శ్రీనివాస్, జే.వి రాజు, పార్లపల్లి రవి, వంగ శ్రీనివాస్ గౌడ్ తానిపర్తి గోపాల్రావు, చెరుకు బుచ్చిరెడ్డి, దేవ.వెంకటేశం, పాతపెల్లి ఎల్లయ్య, నాగేల్లి సాంబయ్య, కుషన పెళ్లి శంకర్ వడ్డేపల్లి శంకర్, ఆడప శ్రీనివాస్, నూనె లతా, మోహన్, శాంత లక్ష్మి, సంధ్యా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.