• Telugu News
  • /Latest

Lok Sabha polls | కాసరగోడ్‌లో ఆరు భాషల అశ్వినిని బరిలో దించిన బీజేపీ.. ఎవరీ అశ్విని..?

Reported by: Thyagi | latest | Mar 25, 2024, 9:27 am IST
Read Time: 4 mins
Lok Sabha polls | కాసరగోడ్‌లో ఆరు భాషల అశ్వినిని బరిలో దించిన బీజేపీ.. ఎవరీ అశ్విని..?

Lok Sabha polls : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల జోరు ఊపందుకుంది. ఇప్పటికే తొలి దశ పోలింగ్‌ కోసం నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. నామినేషన్‌ల ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు అన్ని పార్టీలు వివిధ స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు కొనసాగిస్తున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా కేరళలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ అక్కడ అభ్యర్థుల ఎంపిక విషయంలో మూస ధోరణికి భిన్నంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. కాసరగోడ్‌ అభ్యర్థిగా అశ్విని ఎంపిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

కమ్యూనిస్టుల కంచుకోట అయిన కాసరగోడ్‌ నియోజకవర్గంలో పార్టీ సీనియర్లను కాదని, ఆరు భాషలు అనర్గళంగా మాట్లాడే సాదాసీదా మహిళ అశ్వినికి బీజేపీ టికెట్‌ ఇచ్చింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న 38 ఏళ్ల ఎంఎల్‌ అశ్విని.. మలయాళం, కన్నడం, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్‌ భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. ఈ ప్రతిభే ఆమె ఓటర్లతో ఈజీగా మమేకం కావడానికి సాయపడుతుందని బీజేపీ నమ్మింది. బీజేపీలో చేరకముందు అశ్విని స్కూల్‌ టీచరుగా పనిచేసింది. ప్రస్తుతం బీజేపీ మహిళామోర్చా జాతీయస్థాయి సభ్యురాలుగా ఉన్నారు.

బెంగళూరులో పుట్టి పెరిగిన అశ్విని మాతృభాష కన్నడం. తర్వాత ఆమె కాసరగోడ్‌కు కోడలిగా వచ్చింది. అప్పటికే కన్నడం, ఆంగ్లం, హిందీ భాషల్లో పట్టున్న అశ్విని.. పెళ్లి తర్వాత చుట్టుపక్కల కుటుంబాల ద్వారా తుళు నేర్చుకుంది. అనంతరం తమిళం, మలయాళం భాష మీద కూడా పట్టు పెంచుకుంది. అశ్వినికి పలు భాషలపై పట్టున్న విషయాన్ని గమనించిన బీజేపీ అధిష్ఠానం దిల్లీ కేంద్రంగా దాదాపు 10 రాష్ట్రాల్లోని మహిళామోర్చా కార్యకలాపాల బాధ్యత అప్పగించింది.

ఇదిలావుంటే కర్ణాటక సరిహద్దుకు దగ్గరగా ఉన్న కాసరగోడ్‌లో కన్నడం, మలయాళం, తమిళంతోపాటు మొత్తం ఏడు భాషలు మాట్లాడే జనం ఉన్నారు. ఆరు భాషలు తెలిసిన అశ్వినిని ఇక్కడి నుంచి బరిలో దింపడానికి ఇది కూడా ఒక కారణంగా తెలుస్తున్నది. అన్ని భాషలు తెలుసు కాబట్టి అశ్విని ఇక్కడి జనంతో అలవోకగా మమేకం అవుతుందని బీజేపీ భావించింది. కాగా, గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.