Odisha | వ్యక్తిగత కక్షలతో ఓ గర్భిణి (Pregnant Woman)పై దగ్గరి బంధువే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ చర్యకు ఆ బంధువు భార్య కూడా సహకరించింది. అత్యాచార దృశ్యాలను తన మొబైల్ (Mobile Phone) లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ చేసింది. ఈ దారుణ ఘటన ఒడిశా (Odisha)లోని నబరంగ్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నబరంగ్‌పూర్ జిల్లా జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ గర్భిణి.. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆశా కార్యకర్త సాయం కోరింది. ఆశా కార్యకర్త (ASHA Worker) పద్మ రుంజికర్.. గర్భిణికి దగ్గరి బంధువు. అయితే గర్భిణి, పద్మ భర్త మధ్య వ్యక్తిగత కక్షలు ఉన్నాయి.
ఫిబ్రవరి 28వ తేదీన గర్భిణి, పద్మ కలిసి ఆస్పత్రికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన పద్మ భర్త మార్గ మధ్యలోనే గర్భిణిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అందుకు భార్య కూడా సహకరించింది. అంతటితో ఆగకుండా పద్మ తన మొబైల్‌లో అత్యాచార దృశ్యాలను చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేసింది.
అనంతరం గర్భిణిని స్థానికంగా ఉన్న ఆలయానికి తీసుకెళ్లి.. ఈ విషయం బయటకు చెప్పొద్దని దేవుడి మీద ప్రమాణం చేయించారు. కానీ పద్మ దంపతుల మాట గర్భిణి పట్టించుకోలేదు. తనపై లైంగిక దాడికి పాల్పడ్డ పద్మ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పద్మ దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గర్భిణి పట్ల అనాగరికంగా ప్రవర్తించిన దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.