Manipur | మణిపూర్ మండుతుంటే ప్రధాని జోకులా?: రాహుల్ గాంధీ
Manipur 2 గంటల్లో మణిపూర్‌పై 2 నిమిషాలేనా? భారత మాతను హత్య చేసిన బీజేపీ ప్రధానికి ప్రధాని అంటే ఏమిటో తెలియదు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు న్యూఢిల్లీ: మణిపూర్ విషయంలో ప్రధాని మోదీ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు మణిపూర్ మండిపోతుంటే.. లోక్‌సభలో ప్రధాని నవ్వుతూ జోకులేస్తూ అవిశ్వాస తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ మాట్లాడారని దుయ్యబట్టారు. ‘గురువారం ప్రధాని పార్లమెంటులో 2 గంటల 13 […]

Manipur
- 2 గంటల్లో మణిపూర్‌పై 2 నిమిషాలేనా?
- భారత మాతను హత్య చేసిన బీజేపీ
- ప్రధానికి ప్రధాని అంటే ఏమిటో తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ: మణిపూర్ విషయంలో ప్రధాని మోదీ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు మణిపూర్ మండిపోతుంటే.. లోక్‌సభలో ప్రధాని నవ్వుతూ జోకులేస్తూ అవిశ్వాస తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ మాట్లాడారని దుయ్యబట్టారు. ‘గురువారం ప్రధాని పార్లమెంటులో 2 గంటల 13 నిమిషాలు మాట్లాడారు. చివరిలో మణిపూర్ గురించి రెండు నిమిషాలు మాట్లాడారు.
మణిపూర్ గత కొన్ని నెలలుగా తగలబడి పోతున్నది. ప్రజలు హత్యకు గురవుతున్నారు. మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. కానీ.. మోదీ మాత్రం నవ్వుతూ, జోకులేస్తున్నారు. ఇది ఆయనకు తగినది కాదు’ అని రాహుల్ విమర్శించారు. మణిపూర్‌లో భారత మాతను బీజేపీ హత్య చేసిందని రాహుల్ పునరుద్ఘాటించారు. భారతదేశం అనే భావన మణిపూర్‌లో నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
మణిపూర్‌లో మంటలు ఆర్పాల్సిన ప్రధాని.. ఆ రాష్ట్రం తగులబడుతూనే ఉండాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్మీని రంగంలోకి దించితే రెండు రోజుల్లో మణిపూర్‌లో పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తాయని, కానీ ప్రధాన మంత్రి అది కోరుకోవడం లేదని చెప్పారు. మణిపూర్‌కు వెళ్లేందుకు కూడా ఎందుకో మోదీ ఇష్టపడం లేదన్నారు. విభజించి పాలించడమే బీజేపీ నీతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధాని అయిన తర్వాత రాజకీయ నాయకుడిగా ఉండిపోకూడదు.
దేశ గొంతుకకు ఆయన ప్రతినిధిగా ఉండాలి. రాజకీయాలను పక్కనపెట్టాలి. సగటు రాజకీయ నాయకుడిగా మాట్లాడటం కాకుండా.. ప్రధాని తన వెనుక ఉన్న యావత్ భారత ప్రజలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలి. ఇది చాలా విషాదకరం. బాధాకరం. ప్రధాని తానేమిటో తానే అర్థం చేసుకోలేక పోతున్నారు’ అని రాహుల్ అన్నారు. ‘ప్రధాని కనీసం మణిపూర్‌లో పర్యటించాలి.
అక్కడి తెగలతో మాట్లాడి.. నేను మీ ప్రధాన మంత్రిని అని చెప్పాలి. మాట్లాడాలి. కానీ.. నాకేమీ ఉద్దేశాలు కనిపించడం లేదు. మోదీ 2024లో మళ్లీ పీఎం అవుతారా? అన్నది కాదు ప్రశ్న. ప్రశ్న ఏమిటంటే.. మణిపూర్‌లో చిన్నపిల్లలు, ప్రజలు హత్యకు గురవుతున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. సభ నుంచి సభ్యులను సస్పెండ్ చేయడంపై స్పందిస్తూ.. ఇటువంటివాటిని తాను లెక్క చేయనని చెప్పారు.
తన లక్ష్యం మణిపూర్‌లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతున్నవాటిని ఆపించడమేనని అన్నారు. అందుకోసం తమ చేతిలో ఏ అస్త్రాలు ఉంటే వాటిని ఉపయోగిస్తామని తెలిపారు.