విశాఖ ఇండ‌స్ ద‌వాఖాన‌లో మంట‌లు

ఏపీలోని విశాఖ‌ప‌ట్ట‌ణం జ‌గ‌దాంబా సెంట‌ర్‌లో ఉన్న ఇండ‌స్ ద‌వాఖాన‌లో గురువారం ఉద‌యం భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది.

విశాఖ ఇండ‌స్ ద‌వాఖాన‌లో మంట‌లు
  • కొన‌సాగుతున్న‌స‌హాయ చ‌ర్య‌లు
  • ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో మొద‌లైన మంట‌లు
  • 47 మందిని సుర‌క్షితంగా త‌ర‌లించిన ఫైర్ సిబ్బంది
  • క‌నిపించ‌కుండా పోయిన ఒక న‌ర్సింగ్ విద్యార్థి!


విధాత‌: ఏపీలోని విశాఖ‌ప‌ట్ట‌ణం జ‌గ‌దాంబా సెంట‌ర్‌లో ఉన్న ఇండ‌స్ ద‌వాఖాన‌లో గురువారం ఉద‌యం భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. తొలుత ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో మొద‌లైన మంట‌లు ద‌వాఖాన వ్యాప్తంగా వ్యాపించాయి. ద‌ట్ట‌మైన పొగ సుమారు ఐదు అంత‌స్థుల ద‌వాఖాన అంత‌టా క‌మ్ముకున్న‌ది. పొగ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ద‌వాఖాన అద్దాల‌ను ధ్వంసం చేశారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌లు అదుపులోకి తెచ్చాయి. సుమారు 47 మంది రోగుల‌ను ద‌వాఖాన నుంచి ఫైర్ సిబ్బంది బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. వారిని అంబులెన్స్‌లో వివిధ ద‌వాఖాన‌ల‌కు త‌ర‌లించారు.


రెండో అంత‌స్తులోని ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో గ్యాస్ సిలిండర్ పేల‌డంతో చెల‌రేగిన మంటలు ఇత‌ర వార్డుల‌కు వ్యాపించాయి. పై అంత‌స్తుల్లో చిక్కుకున్న రోగుల‌ను, వారి స‌హాయ‌కుల‌ను నిచ్చెన‌ల ద్వారా కింద‌కు తీసుకొచ్చారు. అయితే, ద‌వాఖాన‌లో ప‌నిచేస్తున్న ఒక న‌ర్సింగ్ విద్యార్థి క‌నిపించకుండా పోయిన‌ట్టు తెలుస్తున్న‌ది. ద‌వాఖాన‌లో అన్నిఅంత‌స్థుల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఇంకా ఎవ‌రైనా ద‌వాఖాన‌లో చిక్కుకున్నారా? అనే అంశంపై గాలిస్తున్నారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. అగ్ని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు. అధికారులు, ఫైర్ సిబ్బంది స‌కాలంలో స్పందించ‌డం వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్రాణం న‌ష్టం జ‌రుగ‌లేద‌ని స్థానిక ఎమ్మెల్యే తెలిపారు.