విధాత : కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆ ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మొండిచేయికి ఓటేస్తే ఆరు గ్యారంటీలు రాకపోగా, మూడు గ్యారంటీలు 3 గంటల కరెంట్ గ్యారెంటీ, ఢిల్లీ సీల్డ్ కవర్‌తో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి దిగడం గ్యారంటీ.. ఆకాశం నుంచి పాతాళంలోని బొగ్గు వరకు కుంభకోణాలు గ్యారెంటి అంటూ విమర్శలు గుప్పించారు. కుంభకోణాల కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకోవడం ఖాయం అని కేటీఆర్ అన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆరెస్ బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడై రేవంత్ రెడ్డి 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి కొన్నాడని కాంగ్రెస్ నాయకులే అంటున్నారని ఆరోపించారు. పదవి కొనుక్కున్న రేవంత్ కోట్ల రూపాయాలకు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారన్నారు. ఇటువంటి వాళ్లకు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడన్నారు. ప్రజలు కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మవద్దని, ఆగం కావొద్దని, బీఆరెస్ చేపట్టిన అభివృద్ధిలో భాగం కావాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
సభలో జనాన్ని చూస్తుంటే సండ్ర వెంకట వీరయ్య గారి గెలుపు ఖాయమనే పరిస్థితి కనబడుతుందన్నారు. సత్తుపల్లి చైతన్యవంతమైన ప్రాంతమని, రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమన్నారు. నిన్నటి దాకా కేసీఆర్ దేవుడు అని పొగిడినవారే.. ఇవాళ దుర్మార్గుడు అని పేర్కొనడం ఎంత వరకు సబబు అని, చైతన్యంతో ఆలోచించిండంటూ పరోక్షంగా పొంగులేటి, తుమ్మలలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ 2 వేల పెన్షన్ ఇస్తే.. డబుల్ ఇస్తామని అంటున్నారని, 24 గంటల కరెంట్ ఇస్తే 48 గంటల కరెంట్ ఇస్తామని అంటున్నారని, గ్యారెంటీ గ్యారెంటీ అని ఊదరగొడుతూ కొత్త కొత్త డైలాగులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
150 ఏండ్ల కింద పుట్టిన పార్టీ.. ఆ పార్టీ వారెంటీ ఎప్పుడో అయిపోయిందని, చచ్చిన పీనుగలాంటి పార్టీ, ఆ పార్టీకే వారెంటీ లేదని, మరి ఆ పార్టీ నాయకుల మాటలకు గ్యారెంటీ ఉందా? ఆలోచించండన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలకు విలువలేదని, హైదరాబాద్‌లో కమాండ్, బెంగళూరులో న్యూకమాండ్, ఢిల్లీలో హైకమాండ్ ఉందని సైటర్లు వేశారు. కాంగ్రెస్‌లో ఒకరి మాట మరొకరు వినరని, వారి హామీలకు పొంతన ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, మహాసముద్రం లాంటి పార్టీని చెబుతారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, ఆసరా పెన్షన్లు అమలు చేస్తున్నారా? ఎందుకు తెలంగాణ మీద ప్రేమ పొంగిపొర్లుతోందని ప్రశ్నించారు.
200 పెన్షన్లు ఇచ్చినోడు.. ఇప్పుడు 4 వేలు ఇస్తామంటే నమ్ముదామా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయని రీతిలో 75లక్షళ మంది రైతు ఖాతాల్లో 73వేల కోట్లు జమ చేసిందన్నారు. 43వేల కోట్లతో ఇంటింటికి నల్లా నీళ్లు అందిస్తుందన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. సత్తుపల్లికి నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేస్తామన్నారు. సీతారామా ప్రాజెక్టు 90శాతం పూర్తయి్దని ఏడాలో మిగతా పనులు పూర్తి చేసి 2లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని రాగానే ఏడు లక్షల ఎకరాలకు ఖమ్మం జిల్లాలో నీళ్లందిస్తామన్నారు.