Minister Raja Narasimha | వైద్యశాఖలో త్వరలో 2500 పోస్టుల భర్తీ

వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న సుమారు 10వేల పోస్టులలో 2,500పోస్టులకు ఆర్ధిక శాఖ అనుమతినిచ్చిందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు

  • By: Somu    latest    Feb 07, 2024 11:17 AM IST
Minister Raja Narasimha | వైద్యశాఖలో త్వరలో 2500 పోస్టుల భర్తీ
  • జాబ్‌ క్యాలెండర్‌కు కట్టుబడి ఉన్నాం
  • మంత్రి దామోదరం రాజనరసింహ వెల్లడి


Minister Raja Narasimha | విధాత : వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న సుమారు 10వేల పోస్టులలో 2,500పోస్టులకు ఆర్ధిక శాఖ అనుమతినిచ్చిందని త్వరలోనే భర్తీ కి నోటిఫికేషన్‌ వెలువడుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. బుధవారం హుజూర్‌నగర్‌ 100పడకల ఆసుపత్రిని మంత్రులు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులతో కలిసి సందర్శించారు. ఆసుపత్రి సమస్యలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలుసుకున్నారు.


అనంతరం మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీలో జాబ్‌ క్యాలెండర్‌కు కట్టుబడి ఉందన్నారు. పేదలకు ప్రభుత్వం నుంచి మెరుగైన విద్యా, వైద్యం అందించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఆరోగ్య శ్రీని 5లక్షల నుంచి 10లక్షలకు పెంచడం జరిగిందన్నారు. మెడికల్‌ కళాశాలలు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను తనకు కలెక్టర్‌, కార్యదర్శుల ద్వారా పంపించాలన్నారు. మౌలిక వసతులతో పాటు డాక్టర్లు, సిబ్బంది ఖాళీల భర్తీ అత్యవసరమన్నారు. హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రిలో ఖాళీల భర్తీకి, వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.


మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖకు సీనియర్‌, సమర్ధుడైన మంత్రి దామోదరం రాజనరసింహ ఉన్నారన్నారు. నిరుపేదలకు ప్రభుత్వ వైద్య వసతి మెరుగు పరచడంలో భాగంగా హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రితో పాటు నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. గవర్నమెంట్‌ పీజీ మెడికల్‌ కళాశాల స్థలం సమస్యను పరిష్కరించి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌, డైరక్టర్‌ కన్నన్‌లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.