Minister Satyavati Rathore
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒక్కొక్కరిదీ ఒక్కో నమ్మకం. రాజకీయ నాయకుల విశ్వాసం, మొక్కులూ, దీక్షలు, ఎక్కువగా తమకు అధికార అవకాశం, తమ పార్టీకి విజయం, తమ అభిమాన నేతకు ఉన్నత పదవీ యోగం అంశాల చుట్టూ వారి విశ్వాసాలు కొనసాగిస్తారు. ఈ వరుసలోనే రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఏడాది కాలంగా చెప్పులు ధరించడంలేదు.
సంవత్సర కాలంగా ఆమె ఈ దీక్షను పట్టుదలతో కొనసాగిస్తున్నారు. ఇది ఆమె సొంత ప్రయోజనం కోసం కాకుండా తమ అభిమాన నేత కేసిఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలనీ కావడం గమనార్హం. అప్పటివరకు తాను చెప్పులు లేకుండా దీక్ష నిర్వహిస్తానని ప్రకటించి అమలు చేస్తున్నారు. ఆదివారం నాటికి ఈ దీక్షకు ఏడాది కాలం పూర్తయింది.
గిరిజన భవన్ ప్రారంభోత్సవ వేదికపై ప్రకటన
ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనభవన్, ఆదివాసీభవన్ లను ఏడాది క్రితం హైదరాబాద్ లో ఇదేరోజు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో గిరిజనుల రిజర్వేషన్లను పదిశాతానికి పెంచడంతో మంత్రి సత్యవతిరాథోడ్ ఈ వేదికపైనే కేసీఆర్ పాదాలకు మొక్కారు. గిరిజనులకు ఇంత గొప్పవరమిచ్చిన కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి కావాలని, తిరిగి తమపార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు చెప్పులు ధరించనని వేదికపైనే చెప్పులు వదిలివేసారు.
ఆరోజు నుంచి ఏడాది కాలంగా చెప్పులు ధరించడంలేదు. ఇబ్బందిగానే ఉన్నా ఇష్టంగా మొక్కుకుంది కనుక మంత్రి సత్యవతి నిర్విఘ్నంగా తన దీక్షను కొనసాగిస్తున్నారు. తనను పిలిచి మంత్రిగా అవకాశం ప్రసాదించిన కేసీఆర్ కు జీవితాంతం ఋణపడి ఉంటానంటూ చేతిపైన కేసీఆర్ పేరు పచ్చబొట్టు వేయించుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం, ములుగు జిల్లాలో వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినపుడూ.. కాలిబాటకూడా సరిగా లేని తండాలకు నడవాల్సి వచ్చినప్పుడు, వాగులు, వంకలు, రాళ్ళు,రప్పలు దాటాల్సి వచ్చినప్పుడు అవస్థపడుతున్నారే తప్ప చెప్పులు మాత్రం వేసుకోవడం లేదు.
కాళ్ళకు బొబ్బలు వచ్చిన సందర్బాలు, ముళ్ళు, రాళ్ళు తగిలి గాయపడిన పరిస్థితుల్లోనూ.. పక్కనున్న వాళ్ళంతా చెప్పులు వేసుకోండి మేడమ్ అంటున్నా చిరునవ్వుతో నడుస్తున్నారే తప్ప ఏడాది కాలంగా చెప్పులు మాత్రం వేసుకోవడం లేదు. ఇదిలాఉండగా మంత్రి సత్యవతిరాథోడ్ దీక్ష పలితం తేలే ఎన్నికల సమయం మరికొద్ది నెలల్లోనే రాబోతుంది.