29న మంత్రుల మేడిగడ్డ పర్యటన

రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈనెల 29న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈమేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది

29న మంత్రుల మేడిగడ్డ పర్యటన
  • బ్యారేజ్ నిర్మాణ నాణ్యత పరిశీలన
  • బ్యారేజ్ లపై అధికారులతో సమీక్ష


విధాత, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈనెల 29న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈమేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో ఉత్తమ్ తో పాటు మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలసి మేడిగడ్డ బయలుదేరుతారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలను ఈసందర్భంగా మంత్రులకు వివరించనున్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్, మేడిగడ్డ, సిందిళ్ళ, అన్నారం బ్యారేజ్ ల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై మంత్రలు అధికారులతో సమీక్షించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ లను సందర్శించి, ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికి సమాచారం ఇచ్చి, సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఈఎన్ సీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.