Daughter Murdered Her Mother: ప్రియుడితో కలిసి కన్న తల్లిని హతమార్చిన మైనర్ కూతురు!

Daughter Murdered Her Mother: ప్రియుడితో కలిసి కన్న తల్లిని హతమార్చిన మైనర్ కూతురు!

విధాత, హైదరాబాద్ :ప్రేమ మత్తు ముందు రక్తసంబంధాలు..వివాహ బంధాలు సైతం చిత్తవుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రేమించినోడి కోసం కట్టుకున్నోడిని..కన్నవారిని కడతేర్చుతున్న దుర్మార్గ ఘటనలు వరుసగా చూస్తున్నాం. తాజాగా ఓ మైనర్ బాలిక తన ప్రియుడి కోసం ఏకంగా కన్న తల్లినే హతమార్చిన వైనం బలహీనపడుతున్న మానవ సంబంధాలకు అద్దం పట్టింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఓ మైనర్ బాలిక 8నెలల క్రితం ఇన్ స్టాగ్రాంలో పరిచయమైన ప్రేమికుడి కోసం కని పెంచి కంటికి రెప్పలా సాకిన తల్లినే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. జీడిమెట్లలోని ఎన్ ఎల్బీ నగర్ లో నివాసం ఉండే అంజలికి పదవ తరగతి..ఎనిమిద తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు. పెద్దకూతురు తేజశ్రీ(16)కు 8నెలల క్రితం నల్లగొండ జిల్లా కట్టంగూర్ కు చెందిన ఇంటర్ విద్యార్ధి శివ(19)తో ఇన్ స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. వారిమధ్య ప్రేమ ముదిరిపోగా వారం రోజుల క్రితం ఇంట్లో ఉన్న రూ.2లక్షల నగదుతో సహా తేజశ్రీ  ప్రియుడు శివ వద్దకు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న తల్లి అంజలి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తేజశ్రీ ఆచూకీ తెలుసుకుని ఆమెను తిరిగి తల్లి వద్దకు చేర్చారు. తాను శివతోనే ఉంటానని..అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతురును ఇంత చిన్న వయసులో ప్రేమ, పెళ్లి ఎందుకంటూ తల్లి అంజలి మందలించింది. తండ్రి ఏడాది క్రితమే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇక తన ప్రేమకు ఏకైక అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని తేజశ్రీ నిర్ణయించుకుంది. సోమవారం రాత్రి ప్రియుడు శివకు విషయం తెలిపింది. శివ తన తమ్ముడు యశ్వంత్ తో కలిసి బాలిక ఇంటికి చేరుకున్నాడు.

ఇంట్లో పూజ చేస్తున్న తల్లి అంజలిని వెనుక నుంచి చున్ని బిగించి శివ, యశ్వంత్ లతో కలిసి తేజశ్రీ గొంతు నులిమి హత్యాయత్నం చేసింది. అంజలి స్పృహ కోల్పోయి పడిపోవడంతో చనిపోయిందనుకున్నారు. కొద్ది సేపటికి అంజలి మళ్లీ కదలడంతో ప్రాణాలు పోలేదని గ్రహించింది. ఇంతలో పక్క గదిలో చదువుకుంటున్న చిన్న కూతురు  అలికిడి విని తల్లి వద్దకు రాగా..ఆమ్మ పడిపోయిందని..ఎవరినైనా పిలుచుకరమ్మని చెప్పి ఆమెను తేజశ్రీ బయటకు పంపించింది. చెల్లి బయటకు వెళ్లిపోగానే ప్రియుడు శివ, యశ్వంత్ లను మళ్లీ ఇంట్లోకి పిలిచిన తేజశ్రీ వారితో కలిసి తల్లి అంజలిపై దాడి చేసింది. శివ, యశ్వంత్ లు అంజలి తలపై  దుప్పటిని బిగించిగా…కూతురు తేజశ్రీ సుత్తితో ఆమె తలపై కొట్టింది. అప్పటికి ప్రాణం పోకపోవడంతో యశ్వంత్ కత్తితో ఆమె గొంతు కోశాడు. దీంతో అంజలి ప్రాణాలు వదిలింది. అనంతరం నిందితులు ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. చిన్న కూతురు ఇంట్లోకి వచ్చి చూడగా తల్లి చనిపోయి ఉండటంతో బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి అంజలి హత్యకు పాల్పడిన పెద్దకూతురు తేజశ్రీ అదుపులోకి తీసుకున్నారు. శివ, యశ్వంత్ ల కోసం గాలిస్తున్నారు. హత్యకు గురైన అంజలి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి ఐలమ్మకు స్వయానా మునిమనవరాలు.  అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్‌గా ఉన్నారు. ఆమె స్వగ్రామం తొర్రూరు మండలం ఇనుగుర్తి. సొంత కూతురే తల్లిని హత్య చేసిందన్న వార్తతో బంధువులు, కళాబృందం సభ్యులు, స్వగ్రామంలోని వారంతా తీవ్ర విషాదంలో మునిగారు.