Jeedimetla: జీడిమెట్లలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

  • By: sr    news    Apr 17, 2025 10:54 PM IST
Jeedimetla: జీడిమెట్లలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

విధాత: కంటికి రెప్పలా పిల్లలను సాకాల్సిన తల్లులే కర్కశంగా వ్యవహరిస్తూ కాలయములవుతున్న ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో ఓ తల్లి తన ప్రియుడితో బంధానికి అడ్డుగా ఉన్నారంటూ పన్నెండేళ్ల లోపున్న తన ముగ్గురు కుమారులను చంపిన ఘటన సంచలనం రేపింది.

అదే సమయంలో మైలార్ దేవ్ పల్లి అలీ నగర్ లో ఓ తల్లి తన 15రోజుల చిన్నారిని బకెట్ నీళ్లలో ముంచి చంపేసిన దారుణం చోటుచేసుకుంది. తల్లులే తమ పిల్లలను బలిగొన్న ఆ దారుణ ఘటనలను మరువక ముందే మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో మరో తల్లి కిరాతకం వెలుగుచూసింది.

గాజుల రామారంలో ఇద్దరు పిల్లలను వేట కొడవలి నరికి చంపిన తల్లి అనంతరం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స‌మాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇద్ద‌రు పిల్ల‌లు, త‌ల్లి మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.