విధాత : మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం సంతోషదాయకమైనప్పటికి 2026 డిలిమిటేషన్ తర్వాతానే అమలు చేయాల్సిరావడం మాత్రం అసంతృప్తికరంగా ఉందని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభిప్రాయ పడ్డారు. ఓ వార్త సంస్థతో ఆమె మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని, ఇందుకు ప్రభుత్వం అసంబద్ధమైన సాంకేతిక కారణాలతో తప్పించుకోకుండా డిలిమిటేషన్ నిబంధనకు సవరణ చేసి, 2011 జనాభా లెక్కలను ఆధారంగా రిజర్వేషన్ తక్షణ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. బిల్లు ఆమోదంతో రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగడానికి మొదటి అడుగుపడినందుకు సంతోషంగా ఉందన్నారు.
దేశంలో కుల వ్యవస్థ ఉన్న నేపథ్యంలో బిల్లులో ఓబీసీల గురించి ప్రస్తావన లేదని, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేదని, చట్టసభల్లో ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉండేదన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల లోక్ సభలో మహిళా సభ్యుల సంఖ్య 181కి చేరుతుందని, ఇప్పుడు కేవలం 80 మంది మాత్రమే ఉన్నారన్నారు. మహిళా బిల్లు ఆమోదంతో ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ వ్యక్తికి క్రెడిట్ ఇచ్చే బదులు ఈ క్రెడిట్ దేశ మహిళలకు వెళ్లాలన్నది నా భావన అన్నారు.
దూరదృష్టి కలిగిన మన నాయకులు మహిళలకు ఓటు హక్కు కల్పించారని, నిజానికి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది మహిళా నాయకులు రిజర్వేషన్ వద్దని అన్నారని గుర్తు చేశారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మహిళలకు సరైన వాటా దక్కుతుందని వారి ఆలోచనగా ఉండేదన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత 75 ఏళ్లలో చట్టసభల్లో మహిళలకు సరైన భాగస్వామ్యం లభించలేదన్నారు. అందు వల్లనే 1970ల తర్వాత రాజకీయాల్లో సరైనా భాగస్వామ్యం కోసం మహిళా రిజర్వేషన్ల డిమాండ్ వచ్చిందన్నారు.
ఆ పోరాట ఫలితమే 33 శాతం రిజర్వేషన్లని, ఇందుకు ఎవ్వరూ క్రెడిట్ తీసుకోవద్దని, ఎందుంటే 75 ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీ మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యత కల్పించలేదన్నారు. 10 రోజుల క్రితం మహిళా రిజర్వేషన్ల కోసం మా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలోనే మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని తీర్మానం చేశామన్నారు. మా పార్టీ ఈ అంశాల పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ గత తొమ్మిదిన్నరేళ్లుగా మహిళా రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించిందన్నారు. రాజకీయ ఒత్తిడితోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలన్న నిర్ణయం జరిగిందన్నారు. ఈ బిల్లుపై హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా తీర్మానం చేసిందని, మహిళా బిల్లుకు అనుకూలంగా డిమాండ్లు వస్తుండడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తీర్మానం చేయడం వంటి వాటి వల్ల బిల్లును ప్రవేశపెట్టాలన్న ఒత్తిడి ప్రభుత్వంపై వచ్చిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో 2024 ఎన్నికల్లో బీజేపీ లాభం జరుగుతుందని భావించడం లేదన్నారు.
2014 2019 ఎన్నికల వివరాలను బట్టి చూస్తే మహిళలు క్రియాశీలక ఓటర్లు అని అర్థమవుతుందని, నా నియోజకవర్గంలో కూడా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారన్నారు. మహిళలు రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ ఈ బిల్లును ఎందుకు తీసుకొచ్చిందో వారు అర్థం చేసుకోగలరన్నారు. అంతేకాకుండా ఓబీసీ మహిళలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదో, 2024 ఎన్నికల నుంచి రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదో కూడా మహిళలకు తెలుసన్నారు.
అసలు బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అన్నది ఎవరికి తెలుసని, మహిళా రిజర్వేషన్ల అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తోందని, కరోనా వల్ల 2021 లో జరగని జనగణను 2022 లేదా 2023లో జరపాల్సిందన్నారు. కానీ వాళ్లు జనగణను జరపలేదని, అది మహిళల తప్పు కాదని, పాలకుల తప్పుకు మహిళలు బాధ్యులన్నట్లుగా బిల్లు అమలు వాయిదా వేయడం సరికాదన్నారు. ఈ పరిణామాలన్నింటిని మహిళలు గమనిస్తున్నారని, అందుకే ఈ బిల్లుతో బీజేపీ ఆశించే రాజకీయ ప్రయోజనాలు నెరవేరవన్నారు.
ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా రాజ్యసభకు, మండలికి సభ్యులు ఎన్నికవుతారు కాబట్టి సాంకేతికంగా ఈ రిజర్వేషన్లను అమలు చేయడం వాటిలో సాధ్యం కాదని, కానీ దానికి ప్రత్యామ్నాయంగా మరో పద్ధతిని పాటించవచ్చన్నారు. అన్ని నామినేటెడ్ పదవుల్లో 33 శాతం మహిళలకు ఇవ్వాలని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు చెబితే రాజ్యసభలో, శాసన మండళ్ళలో మహిళల సంఖ్య పెరుగుతుందన్నారు. ఎన్నికల సంస్కరణల ద్వారా ఈ రెండు సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచవచ్చని, అదృష్టవశాత్తు స్థానిక సంస్థల్లో ఇప్పటికే 14 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు.
మహిళా రిజర్వేషన్లు తొలి మెట్టు మాత్రమేనని, మహిళా సాధికారత కోసము ఎంతో చేయాల్సి ఉందన్నారు. అది తెలంగాణలో బీఆరెస్ ప్రభుత్వం చేసి చూపించిందని, మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిందని, తద్వారా దళిత, గిరిజన మహిళలు మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్లుగా నియమితులయ్యారన్నారు. ఈ తరహాలో అన్ని స్థాయిల్లోనూ ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు.
మతపరంగా రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం అనుమతించబోదని, అందుకే మైనార్టీ మహిళలకు మహిళా రిజర్వేషన్లలో స్థానం కల్పించలేదని, ఇక్కడ కొన్ని అవరోధాలు ఉన్నాయని, గతంలో కొన్ని రాష్ట్రాలు ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తే కోర్టులు వాటిని కొట్టివేసిన సంగతి మరువరాదన్నారు. ఈ సమస్యకు రాజ్యాంగపరంగా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదన్నారు. మహిళా బిల్లు అమలు నేపధ్యంలో మహిళలను రాజకీయాల్లో ప్రొత్సహించాలని అందరూ అనుకోవాలన్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి నేతలు మహిళా నాయకులను ప్రోత్సహించారన్నారు. ఇప్పటివరకు కొంతమంది మహిళలే రాజకీయాల్లోకి ప్రవేశించి పోరాటాలు చేశారని, ప్రస్తుతం దేశంలో మహిళా విద్య పెరిగిందని, రాజకీయంగా అవగాహనతో ఉన్నారని, అదే వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి మార్గం చూపిస్తుందన్నారు.