Modi
విధాత: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ రెండు స్వరాలు దేనికి సంకేతం అనే చర్చ రాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా జరుగుతుంది. ఒకే వ్యక్తి, ఒకే సభలో రెండు రకాలుగా మాట్లాడటం వెనుక దాగి ఉన్న ఆంతర్యం అంతుచిక్కడం లేదు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన ప్రధాని మోదీ వెంటనే కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రగతి, దేశంలో తెలంగాణ పాత్రను అభినందించారు. మొదట తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించినమోదీ దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందుందన్నారు.
దేశాభివృద్ధిలో తెలంగాణ, తెలుగు వారి ప్రతిభ కీలకంగా మారిందన్నమోదీ తెలంగాణ ఆర్థిక హబ్‌గా మారుతోందన్నారు. తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో రైల్వే ట్రాక్‌ల కనెక్టివిటీని పెంచుతున్నామన్నారు.
ఆత్మనిర్భర భారత్‌లోనూ, వ్యాక్సీన్ల తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కూడా సహకరిస్తుంది అంటూనే.. కేసీఆర్ ప్రభుత్వంపై ఒక్కసారిగా తీవ్రమైన ఆరోపణలను ఎక్కుపెట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవితపై పరోక్ష విమర్శలు చేసిన మోదీ కేసీఆర్ ప్రభుత్వ అవినీతి ఢిల్లీ వరకూ పాకిందన్నారు. ఎక్కడైనా అభివృద్ధి కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయి కానీ అవినీతి కోసం తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. దీని కోసమేనా తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసుకుందని మోదీ ప్రశ్నించారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో ట్రైలర్ మాత్రమే చూపించామని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేస్తామన్నారు. 9 ఏండ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. అవినీతి లేకుండా తెలంగాణలో ఏ పని జరగట్లేదన్నారు. అంతే కాదు దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌దేనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే టీఎస్‌పీఎస్‌సీ స్కామ్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు.
బీఆర్ఎస్ , బీజేపీ ఒకటేనని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నది. ఇందులో భాగంగా మొన్నటి వరకు ఢిల్లీ కేంద్రంగా జరిగిన లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తధ్యం అంటూ బీజేపీ నాయకులు రోజు ప్రకటనలు చేశారు. ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు సైతం కవిత అరెస్ట్‌పై అదిగో.. ఇదిగో అంటూ మాట్లాడారు.
కానీ గత ఎనిమిది నెలలుగా బీజేపీ నాయకులు,కేంద్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కావడంతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మైత్రి బంధం మళ్లీ బలపడిందనే ప్రచారానికి బలం చేకూరింది. దీనికితోడు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర మంత్రులను కలిసివచ్చారు.
ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై జరుగుతున్న ప్రచారంపై ఢిల్లీ పెద్దలకు తెలియజేయడంతో పాటు కేసీఆర్‌ను వ్యతిరే కించి వచ్చిన తమ పరిస్థితి ఏంటని నిలదీసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీజేపీ పెద్దలు అసమ్మతిని తగ్గించేందుకు బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారు.
అలాగే గతకొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్నబీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు నేను కొట్టినట్లు చేస్త.. నీవు ఏడ్చినట్లు చేయ్ అన్నట్లుగా వ్యవహరిస్తూ.. మళ్లీ ఒకరిపై ఒక్కరు ఆరోపణలు చేసుకుంటున్నపరిస్థితిని చూస్తున్నం. ఇటీవల మధ్యప్రదేశ్ వేధికగా, తాజాగా వరంగల్ వేధికగా మోదీ కేసీఆర్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంతో పాటు ప్రశంసల జల్లు కురిపించడం బీజేపీ, బీఆర్ఎస్‌లో ఒప్పందంలో భాగమేననే కొందరు అంటుండగా, ఒప్పందం అనే మచ్చని తొలగించుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆరాట పడుతున్నాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాని ప్రసంగంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మోడీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన ఆయన పీఎం మోడీజీ అంటూ.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది కానీ.. మాకు పూర్తిగా నిరాశ కలిగించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం అదే ఫ్యాక్టరీని రూ. 20,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌కు తరలించిందని తెలిపారు.
రూ.520 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ప్రతిపాదించిన వ్యాగన్ రిపేర్ షెడ్ తెలంగాణ ప్రజలను అవమానించడమే. తెలంగాణకు ద్రోహం చేయడమే’’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. వరంగల్‌కు వచ్చిన మోడీ తెలంగాణాకు మొండి చేయి ఇచ్చి, అక్కసు వెళ్లగక్కారన్నారు. కేసీఆర్ కీర్తి ఢీల్లీ తాకుతుందని మోడీ భయపడుతున్నారన్నారు.
గుజరాత్‌లో కూలిన బ్రిడ్జిలే బీజేపీ అవినీతికి సాక్ష్యమన్నారు. అవినీతికి రాజు కాంగ్రెస్ అయితే రారాజు బీజేపీ అన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ పని అంటూ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటికాదని చెప్పేందుకు మోదీ, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్ ప్రయత్నించినట్లుగానే.. బీఆర్ఎస్, బీజేపీతో కలవదని చెప్పేందుకు బీఆర్ఎస్ నాయకులు కూడా పోటీ పడటం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన బట్టి ఇటీవల కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి డీల్ మాట్లాడుకున్నాకే కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యారన్నారు. అవసరం, అవకాశం వచ్చిన ప్రతిసారీ కేసీఆర్, బీజేపీకి మద్దతిచ్చారన్నారు.
మోదీ, కేసీఆర్ కలిసి దేశ, రాష్ట్ర వనరులని కొల్లగొడుతున్నారన్నారు. క్యాప్టలిస్ట్ బీజేపీని, ఫ్యూడలిస్ట్ బీఆర్ఎస్‌ను తెలంగాణ నుంచి తరిమివేయాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కానట్లైతే తెలంగాణ ప్రభుత్వం,కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిపై మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ నాయకులతో పాటు సోషల్ మీడియా వేదికగా చాలామంది తమతమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. బీజేపీ,బీఆర్ఎస్ పార్టీల మధ్య మైత్రి ఉందా..? లేదా..? అనేది సాధారణ ఎన్నికల నాటికైనా బహిర్గతం అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.