మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ పేరు ఖరారైంది. అనేక చర్చల అనంతరం బీజేపీ అధిష్టానం మోహన్ యాదవ్ పేరును ఖరారు చేసింది
భోపాల్ : మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ పేరు ఖరారైంది. అనేక చర్చల అనంతరం బీజేపీ అధిష్టానం మోహన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. అనంతరం పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇక డిప్యూటీ సీఎంలుగా ఇద్దరికి అవకాశం కల్పించింది. రాజీవ్ శుక్లా, జగదీష్ దేవ్‌డాను డిప్యూటీ సీఎంలుగా కొనసాగనున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా నరేంద్ర సింగ్ తోమర్ వ్యవహరించనున్నట్లు బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నూతన సీఎం మోహన్ యాదవ్‌కు మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
మోహన్ యాదవ్ రాజకీయ నేపథ్యం..
శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా మోహన్ యాదవ్ పని చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉజ్జయిని సౌత్ నియోజకవర్గం నుంచి యాదవ్ గెలుపొందారు. 2013లో యాదవ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018 ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు.
ఇక శివరాజ్ సింగ్ కేబినెట్‌లో 2020, జులై 2న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ ప్రేమ్ నారాయణ్ యాదవ్‌పై 12,941 ఓట్ల మెజార్టీతో యాదవ్ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో యాదవ్ 1965, మార్చి 25న జన్మించారు. ఇక ఆయన ఆర్ఎస్ఎస్ లో కొనసాగారు. ఆ తర్వాత బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వ్యాపారవేత్తగా కూడా యాదవ్ రాణిస్తున్నారు.