విధాత బ్యూరో, ఉమ్మడి నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లను డబ్బా ఇండ్లని హేళన చేసి, డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టిస్తామని అధికారంలోకి వచ్చిన బీఆరెస్ ప్రభుత్వం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా కొత్తగా కట్టించలేదని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.
సోమవారం సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో బీఆరెస్ నాయకులు, మాజీ శివాలయ కమిటీ చైర్మన్ గజ్జెల శంకర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ కమిటీ మెంబర్ గజ్జెల జ్యోతి, మరికొంత మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఉత్తమ్ మాట్లాడారు.ఈనెల 6-10 నుంచి ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు.
రానున్న శాసన సభ ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో కూడా పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని, రాహుల్ ప్రధాని అవడానికి ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలే తొలిమెట్టు అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు భాజపా ఎన్నికల కోసమే ప్రవేశ పెట్టిందన్నారు. మహిళా బిల్లు సోనియా గాంధీ మానస పుత్రిక అని, మేం సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ ఎన్నికల్లోపే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు. పైన పెద్ద మోదీ ఉంటే కేసీఆర్ చిన్న మోదీలా తయారయ్యాడని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు కానీ ఇక్కడ ఎమ్మెల్యే సైదిరెడ్డి 300 ఎకరాల భూమి సంపందించిండని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. బీఆరెస్ ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కేటాయించలేదని, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఒక్క మంత్రి పదవి లేదన్నారు.
హుజూర్ నగర్ కి చెందిన ఒక్కో వైన్ షాప్ వద్ద నుంచి రూ.6 లక్షల లంచం ఎమ్మెల్యే సైదిరెడ్డి వసూలు చేశారని ఆరోపించారు. రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడన్నారు. మేళ్ళచెరువు మండల అభివృద్ధిలో నా పాత్ర కీలకమని, సాగర్ ఎడమ కాలువ రైతులకు నీళ్లు లేక పంటలు ఎండి పోతున్నాయని, నేను వేయించిన లిఫ్టులు మూలన పడేశారన్నారు. 24 గంటల విద్యుత్తు విషయంలో ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందన్నారు.