చెన్నై రోడ్లపై మొసలి ప్రత్యక్షం.. వీడియో
మిచౌంగ్ తుపాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దైంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి

చెన్నై : మిచౌంగ్ తుపాను కారణంగా తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దైంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటిలో కార్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో.. రోడ్లపై మొసళ్లు ప్రత్యక్షమవుతున్నాయి.
చెన్నైలోని పెరుంగళత్తూర్ పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఓ పెద్ద మొసలి రోడ్డుపై ప్రత్యక్షమైంది. డివైడర్ వద్ద రోడ్డు దాటేందుకు యత్నించిన మొసలిని.. వాహనదారులు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మొసళ్లు ప్రత్యక్షం కావడంతో చెన్నై నగర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక చెన్నైలోని పలు ప్రాంతాల్లో వీధుల్లో పార్క్ చేసిన వాహనాలు వరద నీటి ఉద్ధృతికి కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నై నగరంతోపాటు పొరుగున ఉన్న కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు సహా పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో విమాన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. రానున్న 24 గంటల్లో చెన్నై నగరంతోపాటు దాని పొరుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. దీంతో జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్తగా పాఠశాలలు, కళాశాలలు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.