Munugodu | కూసుకుంట్ల కంటనీరు.. ఆత్మీయ సమ్మేళనంలో భావోద్వేగం
Munugodu విధాత: మునుగోడు (Munugodu) ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో పార్టీలో తన ఎదుగుదలను తలచుకుంటూ కష్టాల్లో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి టి.హరీష్ రావు లు చేసిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. కూసుకుంట్ల తన ప్రసంగంలో 2003లో టీఆర్ఎస్ పార్టీ స్థాపన తొలినాళ్లలో కేసిఆర్‌కు దగ్గరగా ఉండే దివంగత నేత కళ్లెం యాదగిరిరెడ్డిని కలిసి తాను కూడా ఈ పార్టీ […]

Munugodu
విధాత: మునుగోడు (Munugodu) ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో పార్టీలో తన ఎదుగుదలను తలచుకుంటూ కష్టాల్లో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి టి.హరీష్ రావు లు చేసిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
కూసుకుంట్ల తన ప్రసంగంలో 2003లో టీఆర్ఎస్ పార్టీ స్థాపన తొలినాళ్లలో కేసిఆర్‌కు దగ్గరగా ఉండే దివంగత నేత కళ్లెం యాదగిరిరెడ్డిని కలిసి తాను కూడా ఈ పార్టీ నుండే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిని అవుతానని కోరగా, వెంటనే ఆయన హరీశ్‌రావు ద్వారా కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి పార్టీలో మమేకం చేశారన్నారు. ఆనాటి నుంచి అన్ని సందర్భాల్లో హరీశ్‌రావు నాకు సహకరిస్తూనే ఉన్నారన్నారు.
వారి చేతుల మీదుగా చౌటుప్పల్ వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసుకోవడం అదృష్టం అన్నారు. దివంగత సాంబశివుడి హత్య సందర్భంలో పరిస్థితి బాగా లేదన్నా.. అని హరీశ్‌రావు కు చెప్పగా.. వెంటనే ఆయన పోలీస్ కమిషనర్ దగ్గరికి తీసుకవెళ్లి నాకు పిస్టల్ లైసెన్స్ ఇప్పించారన్నారు.
తాను కష్టాల్లో ఉన్న ప్రతి సందర్భంలోనూ కేసీఆర్, హరీశ్‌రావులు తనకు సహకరించారంటూ ఒక్కసారిగా కూసుకుంట్ల భావోద్వేగంతో కంటనీరు పెట్టుకున్నారు. తనకు సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డిలు ఎల్లవేళలా అందించిన సహకారంతోనే ఈరోజు తాను ఈ స్థాయికి వచ్చానన్నారు. అలాగే పార్టీ, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు, తనపై చూపిన ప్రేమతోనే ఈరోజు ఉన్నత స్థాయికి చేరానని, వారందరి సహకారంతో ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిచానన్నారు.
రాష్ట్ర పార్టీ మొత్తం ఇక్కడకు వచ్చి పనిచేసి గెలిపించడం అదృష్టమని, పార్టీ లేకపోతే నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉండేవాడిని కాదన్నారు. చిన్న రైతు కుటుంబంకు చెందిన తాను ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నానంటే పార్టీ, కార్యకర్తలు, ప్రజలు చూపిన ప్రేమ, వారిచ్చిన బలం, బలగమే కారణమన్నారు. నా బలగం మీరంతా ఇక్కడ ఉన్నంత వరకు మళ్లీ మళ్లీ ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తామని, మరోసారి సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తామన్నారు.
నిత్యం ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నియోజక వర్గం ప్రజల మధ్య తిరుగుతూ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. 2014 ముందు రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి, అసరా పింఛన్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఉన్నాయా ఆలోచించాలన్నారు.
నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ సమస్యపై అవగాహన ఉన్న ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని చౌటుప్పల్ లో మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించి, పథకం ద్వారా నియోజకవర్గ అంతటికి మంచినీటిని అందించడం ద్వారా ఫ్లోరోసిస్ ను తరిమికొట్టామన్నారు. వంద పడకల ఆసుపత్రి వచ్చిందంటే తెచ్చుకున్న తెలంగాణలో కేసిఆర్ పాలనే కారణమన్నారు. కొత్త మున్సిపాలిటీలు తెచ్చుకున్నామని, తండాలను పంచాయతీలుగా మార్చుకున్నామన్నారు.
2014లో తాను ఎమ్మెల్యేగా గెలిచాక చేసిన అభివృద్ధి.. 2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల ఓటమితో ఆగినప్పటికీ, మళ్లీ ఉప ఎన్నికల్లో నన్ను గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గం అభివృద్ధికి అవకాశం ఇచ్చారన్నారు. నియోజకవర్గంలో రోడ్లకు 130 కోట్లు, మున్సిపాలిటీలకు ముప్పై కోట్ల రూపాయలు, తండాలకు రోడ్లకు 30 కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నామంటే ఇక్కడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే, అక్కడ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతోనే సాధ్యమైందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రాబోయే ఎన్నికల్లోను రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ గులాబీ జెండానే గెలిపించుకోవాలన్నారు.