రెండు రోజుల్లో కాంగ్రెస్‌లోకి.. మైనంపల్లి ప్రకటన

  • Publish Date - September 25, 2023 / 02:43 PM IST

విధాత : మల్కాజ్‌గిరి బీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తాను ఈనెల 27వ తేదీలోగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా స్వయంగా ప్రకటించారు. సోమవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు దామోదరం రాజనరసింహ, అంజన్‌కుమార్ యాదవ్‌, మల్లు రవి, మహేశ్‌గౌడ్‌లు మైనంపల్లి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీయై కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 27వ తేదీలోపునా తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లుగా తెలిపారు.

కాగా.. తనకు మల్కాజ్‌గిరి టికెట్‌తో పాటు మరో రెండు టికెట్లు తన అనుచరులకు ఇవ్వాలని తాను కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరడం జరిగిందన్నారు. తనకు మల్కాజ్‌గిరి, తన కొడుకు రోహిత్‌కు మెదక్‌తో పాటు అనుచరుడు నక్క ప్రభాకర్‌కు మేడ్చల్‌ సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసిందన్నారు. స్పెషల్ కేసుగా పరిగణించడంతో పాటు సర్వేల ఆధారంగా తన కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందన్నారు. భట్టి, రాజనరసింహలు మాట్లాడుతూ మైనంపల్లి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందన్నారు. ఆయన చేరికను పార్టీ స్వాగతిస్తుందన్నారు.