Nalanda | మూడేళ్ల చిన్నారి.. మృత్యువును గెలిచాడు.. 40 అడుగుల లోతు నుంచి వెలికితీత

Nalanda | బోరు బావిలో పడిన శివం కుమార్‌ సహాయ సిబ్బందికి అభినందనల వెల్లువ బీహార్‌లోని నలంద జిల్లాలో ఘటన పాట్నా: అధికారుల సకాల స్పందన, సహాయ సిబ్బంది మెరుగైన పనితనం ఒక చిన్నారిని మృత్యుమఖం నుంచి బయటపడేశాయి. కొన్ని గంటలపాటు 40 అడుగుల లోతున్న బావిలో చిక్కుకున్న మూడేళ్ల బాలుడు.. మృత్యువు జయించాడు. తాడు సహాయంతో ఆ బాలుడిని సహాయ సిబ్బంది బయటకు తీయగానే.. అక్కడున్నవారంతా తీవ్ర భావోద్వేగానికి లోనై.. హర్షధ్వానాలు చేస్తూ సిబ్బందిని అభినందించారు. […]

  • By: krs    latest    Jul 23, 2023 1:05 PM IST
Nalanda | మూడేళ్ల చిన్నారి.. మృత్యువును గెలిచాడు.. 40 అడుగుల లోతు నుంచి వెలికితీత

Nalanda |

  • బోరు బావిలో పడిన శివం కుమార్‌
  • సహాయ సిబ్బందికి అభినందనల వెల్లువ
  • బీహార్‌లోని నలంద జిల్లాలో ఘటన

పాట్నా: అధికారుల సకాల స్పందన, సహాయ సిబ్బంది మెరుగైన పనితనం ఒక చిన్నారిని మృత్యుమఖం నుంచి బయటపడేశాయి. కొన్ని గంటలపాటు 40 అడుగుల లోతున్న బావిలో చిక్కుకున్న మూడేళ్ల బాలుడు.. మృత్యువు జయించాడు. తాడు సహాయంతో ఆ బాలుడిని సహాయ సిబ్బంది బయటకు తీయగానే.. అక్కడున్నవారంతా తీవ్ర భావోద్వేగానికి లోనై.. హర్షధ్వానాలు చేస్తూ సిబ్బందిని అభినందించారు.

ఈ ఘటన బీహార్‌లోని నలంద జిల్లా కుల్‌ గ్రామంలో చోటు చేసుకున్నది. ఈ ఊళ్లో నీళ్లకోసం వ్యవసాయ బోరు తవ్వించిన రైతు.. నీళ్లు పడకపోవడంతో దానిని నిర్ల్యక్షంగా వదిలేశాడు. బోరు బావి మృత్యు రూపంలో పొంచి ఉన్న విషయం తెలియక.. అక్కడ ఆటాడుకునేందుకు వెళ్లిన శివం కుమార్‌ అనే మూడేళ్ల బాలుడు.. అందులో పడిపోయాడు. బోరుబావిలో శివం పడిపోయిన విషయాన్ని అతడితో కలిసి ఆడుకుంటున్న ఇతర చిన్నారులు తమ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో అంతా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అధికారుల కూడా చేరుకుని, బాలుడిని బయటకు తీసేందుకు సహాయ చర్యలు మొదలు పెట్టారు. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నామని సర్కిల్‌ ఆఫీసర్‌ శంభు మండల్‌ తెలిపారు. బోరుబావి నుంచి బాలుడి ఏడుపు వినిపిస్తున్నదని చెప్పారు. అతడిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని కూడా పిలిపించారు.

బాలుడిని బోరుబావి నుంచి తీసేందుకు జేసీబీలను, బోరుబావిలోకి ఆక్సిజన్‌ పంపే వ్యవస్థలను రప్పించారు. ఒకవైపు సమాంతరంగా తవ్వుతూనే.. మరోవైపు తాడు సహాయంతో బాలుడిని తీసేందుకు కూడా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఫలించింది.

ఎట్టకేలకు బాలుడిని ప్రాణాలతో బయటకు తీసి.. ఓ తల్లికి కడుపుకోతను నివారించారు. తనతో పాటు పొలానికి వచ్చిన తన కుమారుడు.. బోరు బావి ఉన్న వైపు ఆడుకోవడానికి వెళ్లాడని, కాసేపటికి మిగతా పిల్లలు వచ్చి.. జరిగిన విషయం చెప్పారని బాలుడి తల్లి తెలిపారు.

ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలోని కాజరి బర్ఖేడా గ్రామంలో 20 అడుగుల లోతున్న బోరుబావిలో రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి పడిపోయాడు. సహాయ చర్యలు నిర్వహించి, అతడిని బయటకు తీసినప్పటికీ.. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఇదే మధ్యప్రదేశ్‌లో జూన్‌లో రెండున్న రేళ్ల చిన్నారి 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయింది. అనేక కష్టాలకోర్చి చిన్నారిని కాపాడినప్ప టికీ.. ఆమె ప్రాణం నిలువలేక పోయింది.