NCERT | రాజనీతి శాస్త్రాన్ని అశాస్త్రీయంగా బోధిస్తే ఎలా ?

NCERT | పాఠ్య పుస్తకాల తయారీలో పక్షపాత ధోరణి ఇలాగైతే శాస్త్రీయ దృక్ఫథాన్ని అభివృద్ధి చేయడం ఎలా? (విధాత ప్రత్యేకం) రాజనీతి శాస్త్రం రాజకీయాలను శాస్త్రీయమైన పద్ధతిలో వివరిస్తుంది. అదే పద్ధతిలో విద్యార్థులకు బోధించాలి. రాజనీతి శాస్త్రం పరిపాలన, స్థానిక రాజకీయాలు, స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర స్థాయి రాజకీయాలు, కేంద్రీకృత ప్రభుత్వాలు, ఆయా ప్రభుత్వాల ఆర్థిక విధానాలు, వివిధ రాజకీయ పార్టీల తాత్విక ఆలోచనల గురించి నిష్పక్షపాతంగా శాస్త్రీయంగా తెలియజేస్తుంది. దీనికి భిన్నంగా నేడు రాజనీతి శాస్త్ర […]

  • By: krs    latest    May 30, 2023 7:23 AM IST
NCERT | రాజనీతి శాస్త్రాన్ని అశాస్త్రీయంగా బోధిస్తే ఎలా ?

NCERT |

  • పాఠ్య పుస్తకాల తయారీలో పక్షపాత ధోరణి
  • ఇలాగైతే శాస్త్రీయ దృక్ఫథాన్ని అభివృద్ధి చేయడం ఎలా?

(విధాత ప్రత్యేకం)
రాజనీతి శాస్త్రం రాజకీయాలను శాస్త్రీయమైన పద్ధతిలో వివరిస్తుంది. అదే పద్ధతిలో విద్యార్థులకు బోధించాలి. రాజనీతి శాస్త్రం పరిపాలన, స్థానిక రాజకీయాలు, స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర స్థాయి రాజకీయాలు, కేంద్రీకృత ప్రభుత్వాలు, ఆయా ప్రభుత్వాల ఆర్థిక విధానాలు, వివిధ రాజకీయ పార్టీల తాత్విక ఆలోచనల గురించి నిష్పక్షపాతంగా శాస్త్రీయంగా తెలియజేస్తుంది.

దీనికి భిన్నంగా నేడు రాజనీతి శాస్త్ర పుస్తకాలను తయారు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనేకమంది విద్యావంతులు, మేధావులు పాఠ్యపుస్తకాల తయారీలో పక్షపాత ధోరణిని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పాఠ్యప్రణాళిక ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.

ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో 12వ తరగతి రాజనీతి శాస్త్రంలో పాత పుస్తకంలో తొమ్మిదవ చాప్టర్ గా ‘భారత రాజకీయాల్లో ఇటీవల పరిణామాలు’ (Recent Developments in Indian Politics) ఉన్నది. ఈ యూనిట్ లో 90వ దశకంతోపాటు అనంతర కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలను పాఠ్యాంశాలుగా చేర్చడం జరిగింది. కొత్త పుస్తకంలో ఈ చాప్టర్ లో నుండి కొన్ని అంశాలు తీసివేసి 8వ చాప్టర్ గా పెట్టినారు.

కొత్త యూనిట్ లో 2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన హింస, మారణకాండను పాఠ్యాంశం నుండి తొలగించడం జరిగింది. ఈ పాఠ్య భాగంలో గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన దారుణాలు, వెయ్యి మందికి పైగా మరణించడం, ఒక మాజీ ఎంపీ కుటుంబంలో 70 మంది మరణించడం మొదలైనవి పొందుపరిచారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఈ అల్లర్లపై నిరసన వ్యక్తం కావడం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి పై తీవ్రమైన విమర్శలు వచ్చినాయి.

అనేకమంది ప్రజాస్వామ్య వాదులతో పాటు అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ నేను ప్రపంచానికి ముఖం ఎలా చూపించాలి అని ఇచ్చిన స్టేట్మెంట్ కాపీని పాఠ్యాంశంలో పొందుపరచడం జరిగింది. అలాగే అల్లర్లతో అతలాకుతలం అయిన జనజీవన దృశ్య మాలిక ను పేపర్ కటింగ్ తో పాటు పెట్టినారు. ఈ సంఘటనపై మనవహక్కుల సంస్థ ఇచ్చిన నివేదికను పొందుపరిచారు.

నివేదికలోని ఒక పేరాలో చెప్పబడిన విషయం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో చెప్పడం ప్రాధాన్యమైనది. భారత రాజ్యాంగం రాసుకోవడానికి ముందు జరిగిన చర్చలలోని ఒక ప్రకటనను ప్రస్తావించారు. రాజ్యాంగ సభ యొక్క సలహా మండలి మొట్టమొదటి సమావేశం 27 ఫిబ్రవరి 1947 రోజున జరిగింది. ఈ సమావేశంలో ప్రాథమిక హక్కులు, మైనారిటీలు,షెడ్యూల్ తెగలు,స్వయంపాలిత సంస్థానాలపై చర్చ జరిగింది.

ఆ సమావేశంలో సర్దార్ పటేల్ మాట్లాడుతూ “మనపై వస్తున్న అపవాదులు, అపనమ్మకాలను తప్పని రుజువు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మైనారిటీలకు మనకంటే మెరుగ్గా భద్రతను ఇవ్వగలిగే వారు ఈ దేశంలో ఎవరూ లేరు. వారందరినీ సంతృప్తి పరచడమే మన ప్రధాన లక్ష్యం. మనల్ని మనం పరిపాలించుకుందాం. ఇతరులను పరిపాలించే కోరిక మనకు లేదని నిరూపించుకోవాలి”.
ఈ స్టేట్‌మెంట్‌ రాజ్యాంగ రచన పరంపరలో జరిగిన చర్చలో భాగంగా సర్దార్ పటేల్ ఇచ్చినది.

దేశంలో స్వయం పరిపాలన, ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా ఉండాలో వారు ముందే ప్రకటించారు. ఈ పాఠ్య భాగాన్ని పెట్టడం ద్వారా మానవ జీవితంలో హింస తీసుకువచ్చే కల్లోలాన్ని విద్యార్థులకు అవగాహన చేయడంతోపాటు ఇది ప్రజాస్వామ్యంలో సరైన చర్య కాదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే అవగాహనను విద్యార్థులకు కల్పించే స్పష్టమైన లక్ష్యం పుస్తక రచయితలు చేశారు.

మానవ సంబంధాలను ధ్వంసం చేస్తూ, వివిధ సమూహాలు,మతాలు,జాతుల మధ్య అపనమ్మకాలను సృష్టిస్తే ఈ దేశంలో ఐక్యత సాధ్యమవ్వదు కదా. పటేల్ ఆశించిన ప్రజాస్వామ్య విలువలను గుజరాత్ రాష్ట్రంలో ధ్వంసం చేసినారు. కానీ 597 అడుగుల పటేల్ విగ్రహం పెట్టి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అని పేరు పెట్టారు.

ఇదే పాఠంలో తమకు అనుకూలమైనవి, ప్రతిపక్ష పార్టీలకు రాజకీయంగా అననుకూలంగా ఉన్న పాఠ్యభాగాలను యథావిధిగా కొనసాగించారు. దేశంలో 1989లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు కావడం ద్వారా జాతీయ పార్టీల ఏకచత్రాధిపత్యం ముగిసినట్టుగా చెప్పడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ భారత రాజకీయాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించిన శకం ముగిసినట్టుగా విశ్లేషించారు. మండల్ కమిషన్ ప్రతిపాదనలకు అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం తర్వాత మనదేశంలో బిజెపి గణనీయంగా విస్తరించిందని చెప్పిన పాఠ్యభాగాలను తొలగించలేదు. పాఠ్యాంశాలను తొలగించేటప్పుడు పక్షపాతంతో వ్యవహరించారు.

75 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల పరిపాలన సమయంలో జరిగిన చారిత్రక, పరిపాలన ప్రాధాన్యం ఉన్న అంశాలను పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావించారు. అందులో కొన్ని ప్రజాస్వామ్య వ్యవస్థకు అదనపు బలాన్ని ఇచ్చేవి, మరికొన్ని ప్రజాస్వామ్య ప్రక్రియలో జరగకూడనివి. కాంగ్రెస్ పరిపాలనా కాలంలో జరిగిన తప్పులను పాఠ్యాంశాలలో కొనసాగించినారు. బిజెపి పరిపాలనా కాలంలో జరిగిన తప్పులను తొలగించినారు.

కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు పాఠ్యాంశాలలో ఈ స్థాయిలో జోక్యం చేసుకోలేదు. ఇదే పుస్తకంలో ఏడవ చాప్టర్‌లో గతంలో ఉన్న పాఠ్యాంశాలను యథావిధిగా కొనసాగించారు. ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కులపై జరిగిన దాడులు మారణకాండకు సంబంధించిన పాఠ్యాంశాలను ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగించినారు.

ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఈ పాఠ్యాంశాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నది. కానీ గుజరాత్ అల్లర్లు అంశం తీసివేయడం ద్వారా విద్యార్థులకు నిష్పాక్షిక సమాచారాన్ని దూరం చేశారు. ఈ పాఠ్యాంశాలు తీసేయడం ద్వారా వారికి రాజకీయ లబ్ధి చేకూరుతుంది అనుకోవచ్చు. తమ తప్పులను కప్పిపుచ్చుకున్నామని భ్రమ పడుతుండవచ్చు. చారిత్రక వాస్తవాలను ప్రజా బాహుళ్యం నుండి తప్పించలేరు.

సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత నేటి డిజిటల్ యుగంలో అసత్యాలను ప్రచారం చేస్తాం, వాస్తవాలను కప్పి పెడతామంటే కుదిరే పని కాదు. స్వతంత్రం అనంతరం వివిధ రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరించారనేది వివిధ పుస్తకాల రూపంలో నమోదు చేయబడి ఉంది.

కానీ ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ వ్యవస్థల మీద వాటి నిష్పాక్షిక వ్యవహార శైలి పట్ల ప్రజలకు నమ్మకం పోతుంది. ప్రభుత్వ వ్యవస్థల పట్ల, రాజ్యాంగం అమలుపట్ల నమ్మకం పోతే ప్రజలు ఈ వ్యవస్థను విశ్వాసంలోకి తీసుకోరు, ధిక్కరిస్తారు. ఇదే జరిగితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం వాటిల్లుతుంది.

– ఎర్రోజు శ్రీనివాస్