CM Revanth Reddy| డిసెంబర్ కల్లా కొత్తగా 7వేల పడకల ఆసుపత్రులు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy| డిసెంబర్ కల్లా కొత్తగా 7వేల పడకల ఆసుపత్రులు : సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : ఈ ఏడాది డిసెంబర్ 9 లోపు తెలంగాణలో కొత్తగా 7వేల పడకల ఆస్పత్రులను అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వహించేలా ముందుకు వెళ్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో వసతుల ఏర్పాటు నిమిత్తం కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. బంజారాహిల్స్‌లో ఏఐజీ హాస్పిటల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొత్తగా రాష్ట్రంలో నిమ్స్ లో 2వేలు పడకలు, వరంగల్ లో కూడా 2వేల పడకలు, టిమ్స్ అల్వాల్ లో వేయి పడకలు, సనత్ నగర్ లో వేయి పడకలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి రెండున్నరేండ్లు పట్టవచ్చని అంతలోనే ఈ ఏడాది డిసెంబర్ కల్లా కొత్తగా 7వేల పడకల ఆసుపత్రులను కొత్తగా అందుబాటులోకి తెస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం హెల్త్‌ టూరిజం హబ్‌గా మారిందని.. దేశంలో తయారయ్యే బల్క్‌డ్రగ్‌లో 35శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు.

జినోమ్‌ వ్యాలీ హైదరాబాద్‌కు చాలా కీలకం అని..ఐడీపీఎల్‌ మాజీ ఉద్యోగుల కృషి వల్లే ఫార్మారంగం అభివృద్ధి చెందిందన్నారు. క్యాన్సర్‌ చికిత్సలో నోరి దత్తాత్రేయ సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని.. క్యాన్సర్‌ వల్ల మహిళలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆరోగ్య వివరాలు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జనని మిత్ర యాప్‌ పేదరోగులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దాదాపు 66 దేశాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలందించే స్థాయికి ఏఐజీ చేరుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. హెల్త్‌ టూరిజంలో ప్రభుత్వానికి సహకరించాలని నాగేశ్వర్‌రెడ్డిని కోరామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐజీ ఆసుపత్రి సేవలు ఇంకా విస్తరించాలని సూచించారు. సామాజిక బాధ్యతగా.. ఏడాదిలో ఒక్క నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నూతనంగా ప్రారంభించబడిన ఏఐజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, ఆంకాలజీ, కార్డియాక్ సైన్సెస్ వంటి ఎనిమిది కీలక రంగాలలో సేవలు అందించనున్నట్లుగా ఆసుపత్రి యాజమాన్యం, ప్రముఖ వైద్యులు వై. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.