CONGRESS | చేరికలతో కాంగ్రెస్‌కు కొత్త ఊపు! చల్లారని సీనియర్లు VS జూనియర్ల రచ్చ

CONGRESS | విధాత: రాహుల్ గాంధీ జోడో యాత్ర.. కర్ణాటక ఫలితాలు.. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర. పొంగులేటి, జూపల్లి వంటి బడానేతల చేరికలతో జోష్ మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు సీనియర్ల అసమ్మతి మరోసారి సమస్యాత్మకంగా తయారైంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే రాక.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తగ్గి పని చేస్తానన్న రేవంత్ వ్యవహార శైలితో సీనియర్లతో సమన్వయం నెలకొన్నట్లు కనిపించింది. రేవంత్ తో కలిసి ఉత్తమ్, వెంకట్ […]

  • Publish Date - June 26, 2023 / 01:10 AM IST

CONGRESS |

విధాత: రాహుల్ గాంధీ జోడో యాత్ర.. కర్ణాటక ఫలితాలు.. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర. పొంగులేటి, జూపల్లి వంటి బడానేతల చేరికలతో జోష్ మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు సీనియర్ల అసమ్మతి మరోసారి సమస్యాత్మకంగా తయారైంది.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే రాక.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తగ్గి పని చేస్తానన్న రేవంత్ వ్యవహార శైలితో సీనియర్లతో సమన్వయం నెలకొన్నట్లు కనిపించింది. రేవంత్ తో కలిసి ఉత్తమ్, వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, వంటి సీనియర్లు పలు సభలలో కలిసి హాజరయ్యారు.

అంతా సవ్యంగా సాగుతుందన్న దశలో పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ పార్టీ మారుతున్నారన్న ప్రచారంతో రేగిన వివాదం మరోసారి రేవంత్ వర్సెస్ సీనియర్ల అన్నట్లుగా మారుతున్న తీరు పార్టీ వర్గాలను కలవర పరుస్తుంది. ఠాక్రే, రేవంత్ లు ఒకటై తమ ప్రాధాన్యతను తగ్గిస్తున్నారన్న ఆగ్రహం సీనియర్లలో వ్యక్తం అవుతుంది.

తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ సాగుతున్న ప్రచారం మరోసారి రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లుగా మారుతుంది. తాను పార్టీ మారుతున్నానంటూ సాగుతున్న ప్రచారం కాంగ్రెస్ వార్ రూమ్ నుండే జరుగుతుందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీలో జరగబోయే తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ టీం సమావేశం హాట్ హాట్‌గా సాగనుందని తెలుస్తుంది.

తన పార్టీ మార్పు ప్రచారంపై స్పందించాలని మీడియా ఉత్తమ్‌ను కోరగా రేపటి కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ భేటీలో మాట్లాడుతానంటూ ఉత్తమ్ ప్రకటించిన తీరు ఆసక్తి రేపుతుంది. పీసీసీ చీఫ్ గా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి టీ కాంగ్రెస్‌లో.. ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న కలవరం కాంగ్రెస్ కేడర్‌లో కనిపిస్తుంది.