ప్రజాస్వామ్యాన్ని చంపేసిన నిర్మాణ శైలి
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఫైర్
ఇది భారతీయులను అవమానించడమే: నడ్డా
విధాత: ఇటీవల ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ శైలిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ శైలి ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని ధ్వజమెత్తారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని మోదీ మల్టీప్లెక్స్, మెదీ మారియట్‌గా అభివర్ణించారు.
కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ స్పందించింది. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అవమానించడమేనని ఆరోపించింది. ఈ మేరకు శనివారం ఇరు పార్టీలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నాయి.
కొత్త పార్లమెంటు భవనం ప్రధానమంత్రి లక్ష్యాలను సాకారం చేస్తుందని, దానిని మోదీ మల్టీప్లెక్స్ లేదా మోడీ మారియట్ అని పిలవాలని జైరామ్ రమేశ్ కోరారు. 2024లో కేంద్రంలో ప్రభుత్వ పాలన మార్పు తర్వాత కొత్త పార్లమెంటు భవనానికి మంచి ఉపయోగం కనుగొనబడుతుందని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.
పార్లమెంట్ నూతన భవనాన్నిప్రారంభించిన నాలుగు రోజుల తాను ఉభయ సభలను, లాబీలను సందర్శించినట్టు తెలిపారు. భవనం నిర్మాణశైలి ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని, లాబీలు, భవనం పార్లమెంట్ నిర్వహణకు అనుకూలంగా లేదని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అల్పబుద్ధికి జైరామ్ రమేశ్ వ్యాఖ్యలే నిదర్శనమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అవమానించడమే తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్లమెంటును వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదని ఎక్స్‌లో మండిపడ్డారు.