Warangal: డాగ్ స్వ్కాడ్‌లోకి.. కొత్త జాగిలాలు! నామకరణం

విధాత, వరంగల్: నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసు జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. గత 28వ తేదీన మొయినాబాద్‌లోని పోలీస్ జాగిలాల శిక్షణా కేంద్రంలో ఎనిమిది నెలల శిక్షణను పూర్తి చేసుకోని వచ్చిన ఐదు పోలీస్ జాగిలాలు వరంగల్ కమిషనరేట్ పోలీస్ డాగ్ స్వ్కాడ్‌లో చేరి విధులు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి.
పేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదు జాగిలాల్లో మూడు బెల్జియన్ మాలినోస్, రెండు గొల్డెన్ రీట్రీవర్ జాతులకు చెందిన జాగిలాలు, వీటికి రానా, జానీ, డయానా,మాక్స్, కైరో గా నామకరణం చేశారు. నూతనంగా వచ్చిన ఈ జాగిలాలను సంబంధించిన పూర్తి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్‌కు హ్యాండ్లర్లు వివరించారు. గతంలోని జాగిలాలు ఎన్నో ప్రేలుడు పదార్థాలను పసిగట్టడంలో విజయం సాధించాయని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
నూతనంగా వచ్చిన జాగిలాలకు మెరుగైన వసతిని ఏర్పాటు చేయాల్సిందిగా సీపీ సంబంధిత అధికారులను అదేశించారు. కార్యక్రమంలో అదనపు డీపీసీ సురేష్‌కుమార్, ఆర్.ఐ శ్రీనివాస్, డాగ్ స్వ్కాడ్ ఇంచార్జ్ హెడ్‌కానిస్టేబుల్ ప్రభాకర్‌తో పాటు హ్యాండ్లర్లు రాజేష్ కుమార్, వెంకన్య, సురేష్, దిలీప్ పాల్గొన్నారు.