Nizamabad | నిజామాబాద్ అభివృద్ధికి.. BRS చేసింది శూన్యం: మహేశ్‌ కుమార్ గౌడ్

Nizamabad | కేటీఆర్ మాటలన్ని మోసపూరితమే టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్‌ కుమార్ గౌడ్ విధాత, ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ ను అన్ని విధాల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, నిజామాబాద్ అభివృద్ధికి బీఆరెస్‌ చేసింది శూన్యమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేశ్‌ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా ఐటీహబ్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్ అహంపూరితంగా మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ […]

  • Publish Date - August 10, 2023 / 02:38 PM IST

Nizamabad |

  • కేటీఆర్ మాటలన్ని మోసపూరితమే
  • టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్‌ కుమార్ గౌడ్

విధాత, ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ ను అన్ని విధాల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, నిజామాబాద్ అభివృద్ధికి బీఆరెస్‌ చేసింది శూన్యమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేశ్‌ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా ఐటీహబ్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్ అహంపూరితంగా మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి పార్టీ అన్న కేటీఆర్ విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రాజకీయాల్లో కేటీఆర్ ఒక పిల్ల బచ్చా అని, కాంగ్రెస్ చరిత్ర ,కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం చేసిన కృషిని గురించి వాళ్ళ తండ్రి కేసీఆర్ ను అడిగితే తెలుస్తుందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం సబ్బండ వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నేతలు ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్ లాంటి నాయకులు, విద్యార్థులు అలుపెరగకుండా పోరాటం చేశారని గుర్తు చేశారు.

ఆరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు పట్టుబట్టి సోనియా గాంధీతో మన్మోహన్ సింగ్ తో మాట్లాడి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేశారని, అందులో కేటీఆర్ తండ్రి పాత్ర చాలా చిన్నదని, కానీ ప్రత్యేక రాష్ట్రం తామే సాధించామని గొప్పలు చెప్పుకొని అమాయక ప్రజలను మోసం చేశారన్నారు.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో అమెరికా నుండి దిగిన కేటీఆర్, కవితకు తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని, కేవలం వాళ్ల తండ్రి పేరును అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదిగారే తప్ప, నిజానికి కేటీఆర్, కవితకు అంత సీన్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కొన్ని లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు.

కాళేశ్వరం పేరిట, భూముల కుంభకోణాల పేరిట, ఇసుక, మైనింగ్, లిక్కర్ దందాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ అవినీతికి పాల్పడి లక్షల కోట్లు సంపాదించిన కుటుంబం దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం కల్వకుంట్ల కుటుంబమేనన్నారు. అలాంటి కుటుంబం నుండి వచ్చిన కేటీఆర్, కవితలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ పేరును సంబోధించే అర్హత కేటీఆర్ కు లేదని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వాల హాయంలోనే జిల్లాకు 20, 21వ ప్యాకేజీ ద్వారా అలాగే గుత్ప ఆలీ సాగర్ వంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా జిల్లా ప్రజలకు త్రాగు, సాగునీటిని అందించామన్నారు. మెడికల్ కాలేజీ తో పాటు ప్రతిష్టాత్మక తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన మునిసిపల్ భవనానికి కిటికీలు పెట్టడానికి బీఆరెస్‌కు తొమ్మిది సంవత్సరాల సమయం పట్టిందని ఈ ఒక్క ఉదాహరణ చాలు నిజామాబాద్ అభివృద్ధి పై బీఆరెస్‌కు ఉన్న చిత్తశుద్ధి తెలిసిపోతుందని మహేశ్‌గౌడ్ విమర్శించారు.

కేటీఆర్, కవిత అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఐటీ హబ్ పేరుతో వాటి చుట్టుపక్కల ఉన్న భూములను కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర లేపారని, ఐటీ హబ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కు అక్కడి నుంచి కూతవేటు దూరంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కనబడలేదని చురకలేశారు.

దాదాపు ఒక్క నిజామాబాద్ నగరంలోనే 50 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే , ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చారో సమాధానం చెప్పాలని, కేవలం 3 ఎకరాల్లో ఒక భవనాన్ని నిర్మించి దానికి ఐటీ హబ్ అని పేరు పెట్టి జిల్లా ప్రజలను మోసం చేయాలని చూడడమే కాకుండా జిల్లాకు వచ్చి కాంగ్రెస్ పార్టీపై అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు.

ఇకనైనా కేటీఆర్ మాటలను అదుపులో పెట్టుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆరెస్‌ ను ప్రజలు సాగనంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గ్రహించిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని, కేటీఆర్ అహంపూరిత మాటలు మానుకొని ప్రజలకు బిఆరెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.